రీసెంట్ గా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా... బ్రహ్మణ కమ్యూనిటిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పరుశురామ అనే అఖిల భారత బ్రాహ్మణ మహాసభ కార్యక్రమంలో పాల్గొని ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ... "బ్రాహ్మణులు ఎప్పుడూ సమాజంలో గౌరవనీయమైన స్దానంలో ఉన్నారు. అందుకు కారణం వారు చేసిన త్యాగాలు, వగైరా. అందుకే బ్రాహ్మణ సమాజం సమాజాన్ని గైడ్ చేసే గురు స్దానంలో ఉంది." అని కామెంట్ చేశారు.

ఇది చూసిన సినీ నటి లావణ్య త్రిపాఠి 'ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఈ కులం వారికి సమాజంలో ఎందుకింత అధమ స్థానం ఉందో నాకు అర్థం కావడంలేదు. మనం చేసే పనులు మన స్థాయిని తెలియజేస్తాయి కానీ కులం కాదు' అంటూ వివాదాస్పద ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఎక్కడ ఈ ట్వీట్ గొడవలకు దారి తీస్తుందోనని భావించి వెంటనే దానిని తొలగించారు. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు భయపడి ట్వీట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని అడుగుతున్నారు. దీనికి ఆమె సమాధానమిచ్చింది. తన అభిప్రాయాన్ని వెల్లడించి అనవసరంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసి వివాదంలో చిక్కుకోకూడదని ఆ ట్వీట్ తొలగించినట్లు చెప్పుకొచ్చింది. ఒక్కోసారి ఇలాంటి ట్వీట్లు తప్పుడు అర్ధాలకు దారి తీస్తాయని అన్నారు.

ఆ ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ తాను కులం, మతం కంటే మనం చేసే పనుల ద్వారానే మన మంచితనం బయటపడుతుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సరైన అవకాశాలు లేవు. ఆమె నటించిన 'అర్జున్ సురవరం' సినిమా కూడా రిలీజ్ కి నోచుకోవడం లేదు.