బాలీవుడ్ లో  త‌నూశ్రీ ద‌త్తా మొద‌లు పెట్టిన మీటూ ఉద్య‌మం ప‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బాధిత మ‌హిళ‌లు నిర్భయంగా బ‌య‌ట‌కి వ‌చ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి వివ‌రిస్తుండగా, దీనిపై దేశ‌మంత‌టా పెద్ద చ‌ర్చ న‌డుస్తుంది. ఈ నేపధ్యంలో  ప‌లువురు ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు బాధిత మ‌హిళ‌ల‌కి త‌మ స‌పోర్ట్ అందిస్తున్నారు. స్పందిస్తున్నారు. మద్దతు ప్రకటిస్తున్నారు. మీడియా కూడా ఈ ఉద్యమాన్ని సెలబ్రెటీల దృష్టికి తీసుకువెళ్లి వారిని ఇందులో భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేస్తోంది. 

'మీటూ' ఉద్యమం ఏ స్దాయికి వెళ్లిందంటే...ఆ విషయమై కామెంట్ చేయటానికి కూడా సెలబ్రెటీలు భయపడుతున్నారు. ఏం మాట్లాడితే ఏ తలనొప్పి వచ్చి పడుతుందో అని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా 'మీటూ' పై స్పందించాల్సిన అవసరం రజనీకాంత్ భార్య లతా రజనీకి పడింది. అయితే ఆమె తప్పించబోయారు కానీ తప్పనిసరి పరిస్దితిల్లో మాట్లాడారు. అయితే ఆ పదాలను ఆవిడ చాలా జాగ్రత్తగా వాడారు. 

లత ఏమంటారంటే.... "ప్ర‌స్తుతం ఉదృతంగా సాగుతున్న మీటూ ఉద్య‌మంపై నేను ఎలాంటి కామెంట్ చేయ‌ద‌ల‌చుకోలేదు. ఇది వ్యక్తుల వ్య‌క్తిగ‌త జీవితాల‌కి సంబంధించిన‌ది. దీని గురించి స‌రైన వ్య‌క్తులు మాట్లాడితేనే మంచిది. మేము మాట్లాడ‌డం స‌రికాదు."

అలాగే  నా అభిప్రాయం ఏంటంటే ఎక్క‌డ చెడు జ‌ర‌గ‌కూడ‌దు. ఎవ‌రు ఇబ్బందులు ఎదుర్కోకూడ‌దు. ప్ర‌తి ఒక్క‌రు ఐక్య‌త‌తో ఉండాల‌ని కోరుకుంటున్నాను అంటూ ముగించేసారు. మీడియా వాళ్ళను ఆ టాపిక్ పై ప్రశ్నించనివ్వలేదు. 

సరే మీడియావాళ్లు ఊరుకుంటారా...మేడం...మీ  భ‌ర్త పొలిటిక‌ల్ ఎంట్రీకి గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పండన్నట్లు గా ప్రశ్నించారు. మళ్లీ ఆమె ఇరుకున పడింది. అయితే ఆ  మాట దాట‌వేసి వేరే విష‌యాల గురించి మాట్లాడారు ల‌తా.