'రంగస్థలం' సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ రేంజ్ మరింత పెరిగింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా మహేష్ బాబుతో సినిమా అనుకున్నారు. కానీ వర్కవుట్ అవ్వలేదు.

దీంతో మహేష్ కోసం అనుకున్న కథను బన్నీతో చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలుకావాలి. కానీ స్క్రిప్ట్ పనులు పూర్తికాకపోవడంతో సినిమాను మొదలుపెట్టలేదని సమాచారం. కథ విషయానికొస్తే.. రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం చుట్టూ తిరిగే కాన్సెప్ట్ తో రియలిస్ట్ గా ఉంటుందని తెలుస్తోంది.

అలా అని ఎంటర్టైన్మెంట్ కి లోటేం ఉండదు. కమర్షియల్ అంశాలు అన్నీ ఉండేలా చూసుకుంటున్నారు. కథ చాలా పెద్దదిగా రావడంతో 'బాహుబలి' స్టైల్ లో రెండు భాగాలుగా సినిమాను తీయాలని అనుకుంటున్నారట. దాదాపు ఏడాదిగా ఈ కథపై పని చేస్తున్నాడు సుకుమార్. రీసెర్చ్ లో ఆయనకి ఎర్ర చందనంకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియడంతో పదుల సంఖ్యలో ఇంటరెస్టింగ్ ఎపిసోడ్లు వచ్చాయట.

వాటన్నింటినీ సినిమాలో చూపించడం కష్టమని, మొదట తన శిష్యులతో వెబ్ సిరీస్ చేయించాలని ప్లాన్ చేశాడట సుక్కు. దీనికోసం అమెజాన్ సంస్థతో చర్చలు కూడా జరిపారు. కానీ ఆ తరువాత ఆయన ఆలోచన మారడంతో రెండు భాగాలుగా సినిమాను తీయాలనుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, బన్నీతో ఈ విషయాలను చర్చించి వీలైనంత తొందరగా సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారు.