ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత ఖరీదైన సినిమా RRR. సౌత్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ భాషల్లో ఈ మల్టీస్టారర్ సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. 

ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. సినిమాను అనుకున్న రిలీజ్ డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. మొదటి నుంచి సినిమా షెడ్యూల్స్ లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హీరో రామ్ చరణ్ కు ఎదురైన పరిస్థితుల కారణంగా రెండు సార్లు షెడ్యూల్స్ లో మార్పులు చేయాల్సి వచ్చింది. గతంలో కాలి గాయానికి గురైన చెర్రీ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు సైరా కారణంగా మరోసారి షూటింగ్ ని ఆలస్యంగా స్టార్ట్ చేయనున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రమైన సైరాను రామ్ చరణ్ సొంత ప్రొడక్షన్ హౌజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ తో దర్శకుడు బల్గెరియా లో యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాడు. ఆ షూటింగ్ ఎండింగ్ లో ఉంది. దీంతో కొత్త షెడ్యూల్ ని వెంటనే స్టార్ట్ చేయాలనీ అనుకున్న RRR యూనిట్ కి చరణ్ బ్రేక్ ఇచ్చాడు. సైరా ప్రీ రిలీజ్ అలాగే రిలీజ్ పనులు ఉన్నాయి కాబట్టి షూటింగ్ లో పాల్గొనడం కష్టంగా మారింది. వీలైనంత త్వరగా సైరా పనులను ముగించుకొని హైదరాబాద్ లో RRR షూటింగ్ ని స్టార్ట్ చేసేందుకు చరణ్ సిద్దమవుతున్నాడు.