బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. ఇప్పుడు మూడో సీజన్ కి సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ షో మొదలుకావాలి కానీ ఆలస్యమవుతూ వస్తోంది. దానికి కారణం సరైన కంటెస్టంట్ లు దొరకకపోవడమేనని తెలుస్తోంది. రెండో సీజన్ కి ఆశించినంత క్రేజ్ రాలేదు.

సెలబ్రిటీలు కూడా పెద్దగా లేరనే విమర్శలు వచ్చాయి. దీంతో మూడో సీజన్ కి కాస్త పేరున్న సెలబ్రిటీలను తీసుకుందామనుకుంటే అడ్డంకులు వస్తున్నాయి. వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండడమనేది మామూలు విషయం కాదు. బిగ్ బాస్ కోసం బయట సినిమాల షూటింగ్ లు వదులుకుంటే కెరీర్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.

పైగా ఫోన్ లేకుండా వంద రోజులు ఉండడం సెలబ్రిటీలకు కాస్త కష్టమైన పనే. సెలబ్రిటీలు చిన్నవారైనా, పెద్ద వారైనా బయట వ్యవహారాలు చాలానే ఉంటాయి. అందుకే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అప్పటికీ షో నిర్వాహకులు రోజులు ఒకటి లేదా రెండు ఫోన్లు చేసుకోవచ్చని ఛాన్స్ ఇస్తున్నా.. సెలబ్రిటీలు మాత్రం నో చెబుతున్నారు.

ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఉన్న కొందరు నటులు, యాంకర్లు, సోషల్ మీడియాలో పాపులర్ అవుతోన్న వాళ్లు మాత్రమే షో కోసం మిగులుతున్నారు. వారిని పెట్టుకొని నాగార్జున లాంటి హోస్ట్ ని తీసుకొని రావడం ఎబ్బెట్టుగా ఉంటుంది.

బిగ్ బాస్ టీం ఎంతమందిని సంప్రదిస్తున్నా.. సెలబ్రిటీలు మాత్రం ఎక్కువగా నో చెబుతున్నారు. దానికి కారణం షో వంద రోజులు కావడం, మొబైల్ లేకుండా ఉండాల్సి రావడం వంటివి కీలకంగా కనిపిస్తున్నాయి.