లతా మంగేష్కర్ చివరగా హైదరాబాద్ వచ్చింది 2002లో. అప్పుడు ఆమె ఓ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో లతా మంగేష్కర్ హైదరాబాద్ పై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టారు.
ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఆదివారం రోజు మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతో గత నెల 8న ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతా(Lata Mangeshkar)జీ.. అప్పటి నుంచి ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు.
ఈ మధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. దీనితో లతా మంగేష్కర్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆదివారం సాయంత్రమే ఆమె అంత్యక్రియలు కూడా ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా లతా మంగేష్కర్ కి నివాళులు అర్పించారు.
ఇదిలా ఉండగా లతా మంగేష్కర్ లైఫ్, ఆమె పాడిన పాటలని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగులో ఆమె పాడింది కేవలం మూడు పాటలే. కానీ హైదరాబాద్ అంటే లతా మంగేష్కర్ కి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. పలు మార్లు వివిధ కార్యక్రమాల కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు.
లతా మంగేష్కర్ చివరగా హైదరాబాద్ వచ్చింది 2002లో. అప్పుడు ఆమె ఓ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో లతా మంగేష్కర్ హైదరాబాద్ పై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టారు. చార్మినార్ సమీపంలో లాడ్ బజార్ లో దొరికే గాజులు అంటే తనకు ఎంతో ఇష్టం అని లతా మంగేష్కర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ కి ఎవరైనా వస్తే మొదటగా చూడాలనుకునేది చార్మినార్ నే. నా చిన్న తనంలో మా నాన్న చార్మినార్ ప్రాంతం నుంచి మా అమ్మకు ఓ నెక్లెస్ తీసుకువచ్చారు. ఆ నెక్లెస్ పై చార్మినార్ బొమ్మ కూడా ఉంది. అప్పటి నుంచి నాకు చార్మినార్ చూడాలనే కోరిక ఉంది. ఇక అక్కడికి వెళ్లిన మహిళలు తప్పకుండా గాజులు కొంటారు. అంటూ లతా మంగేష్కర్ హైదరాబాద్ పై తనకున్న ప్రేమని అప్పట్లోనే బయట పెట్టారు.
