సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీలో ఈ సినిమాను విడుదల కానివ్వకుండా ఎలక్షన్ కోడ్ పేరుతో అడ్డుకట్ట వేశారు.

అయితే నైజాం, ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూడడానికి జనాలు బారులు తీరుతున్నారు. ప్రేక్షకులు ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో అంతే త్వరగా సినిమా పైరసీ కూడా బయటకి వచ్చిందని సమాచారం.

ఓవర్సీస్ నుండే పైరేటెడ్ లింక్ లు ఆన్ లైన్ లో అప్లోడ్ అయిపోతున్నాయి. హైదరాబాద్ లో సహా చాలా చోట్ల పైరసీ ప్రింట్ బయటకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పైరసీ ఏపీకి కూడా పాకడం ఖాయం. ఇప్పటికే అక్కడ కొందరు విద్యార్ధులు ఆన్ లైన్ లో సినిమాను చూసేస్తున్నారట. ఈ మధ్యకాలంలో పైరసీని నిలువరించడం అత్యంత క్లిష్టమైన పనిగా మారింది.

ఇలా చూసుకుంటే ఏపీ ప్రజలు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని పైరసీలో చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ఏపీలో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్న నిర్మాతలకు భారీ నష్టాలు ఏర్పడడం ఖాయం. మరి ఈ పైరసీని  అడ్డుకుంటారో లేదో చూడాలి!