సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రదర్శించబోతున్న కొందరు థియేటర్ యజమానులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సమాచారం. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రదర్శిస్తే.. థియేటర్లు ధ్వంసం చేస్తామంటూ బెదిరిస్తున్నారట కొందరు వ్యక్తులు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎగ్జిబిటర్లు టీడీపీ  అభిమానులకు, ఫాలోవర్లకు భయపడుతూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రదర్శించడానికి ముందడుగు వేయలేకపోతున్నారట. దీంతో పోలీసుల సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే పోలీసులు ఎన్నికల ప్రచారం పనులతో బిజీగా ఉండడంతో థియేటర్లకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదట.

తెలంగాణా రాష్ట్రంలో ఈ సినిమాకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవు కానీ ఏపీ మాత్రం పరిస్థితి అలా లేదు. పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా థియేటర్లలో సినిమాను ప్రదర్శించే పరిస్థితులు కనిపించడం లేదు.