సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ తాజాగా టీడీపీ కార్యకర్తలు ఎలెక్షన్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.

సినిమాలో చంద్రబాబుని నెగెటివ్ గా చూపించారని, రాబోయే ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన దర్శకుడు వర్మ.. నిజాన్ని ఎవరూ ఆపలేరని, అనుకున్న సమయానికి సినిమా వస్తుందని పోస్ట్ పెట్టారు.

తాజాగా ఈ కంప్లైంట్ పై లక్ష్మీపార్వతి స్పందించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల ఆపడం కరెక్ట్ కాదని అన్నారు. ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని నిలదీశారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి పెంచేశాడు వర్మ. ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.