విజయ్ దేవరకొండ,సమంత కలిసి `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటిపాట విడుదలై ఆకట్టుకుంటుంది.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం `ఖుషి` సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. `నా రోజా నువ్వే` అంటూ సాగే మెలోడీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. వినసొంపుగానూ ఉంది. శ్రోతలను అలరిస్తుంది.
హీరోయిన్ సమంతని ఇంప్రెస్ చేసేందుకు హీరో విజయ్ దేవరకొండ పడే పాట్లు, ప్రయత్నాల బ్యాక్ డ్రాప్‌లో ఈ పాట వస్తుండటం విశేషం. ఇందులో సమంత ముస్లీం అమ్మాయిగా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ హిందూ అబ్బాయిగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక `నా రోజా నువ్వే` అంటూ సాగే ఈ పాటకి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ రాయడం విశేషం. హషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించారు. ఆయనే ఈ పాటని ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
దర్శకుడు శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా `ఖుషి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్,భూమిక కలిసి నటించిన క్లాసిక్ మూవీ `ఖుషి`లోని ఈగో అంశాలు ఈ `ఖుషి` సినిమాలోనూ ఉంటాయని తెలుస్తుంది. అదే సినిమాకి మెయిన్ పాయింట్ అని టాక్. మరి నిజం ఏంటనేది తెలియాలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే. ఈ సినిమా ఆ రోజు పాన్ ఇండియా తరహాలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్రేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ తన అభిమానులకు ట్రిబుల్ ట్రీట్ ప్లాన్ చేశారు. ఒకటి `ఖుషి` సాంగ్‌ని విడుదల చేయగా, రెండోది ఐస్‌క్రీమ్‌లు అందిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, ముంబయి, పుణే, ఢిల్లీ వంటి నగరాల్లో ది దేవరకొండ బర్త్ డే ట్రక్ పేరుతో ఫ్రీగా ఐస్‌క్రీమ్‌లు అందజేయనున్నట్టు విజయ్ ట్వీట్ చేశాడు. మూడోది ది రౌడీ బర్త్ డే బాష్ సేల్. తన రౌడీ వేర్స్ నుంచి 60శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ప్రొడక్ట్ చివరి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది.
