కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అనేక రంగాల్లో ఇబ్బంది పెడుతుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మంచే చేస్తుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న మరో టాలెంట్‌ని బయటపెడుతుంది. ఫ్యామిలీతో సరదాగా గడిపేలా చేస్తుంది. ఆ మధ్య చిరంజీవి వాళ్ళమ్మకి చేపల ఫ్రై చేసి వాహ్‌ అని వాళ్ళమ్మచేత అనిపించుకున్నారు. తాజాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు చేపల పులుసు చేశారు. అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు.

కృష్ణంరాజు వీకెండ్‌లో భాగంగా ఇంట్లో స్వతహాగా చేపల పులుసు వండిపెట్టారు. గుమగుమలాడే వాసనని ఆస్వాధిస్తూ బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఈ వీడియోని కృష్ణంరాజు కుమార్తె ప్రసీద సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. `వీకెండ్‌ స్పెషల్‌.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయన్ని మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోతుందో.. లేదో చెప్పేస్తారు. ఆయన చాలా ఎక్స్ పర్ట్` అని ట్వీట్‌ చేసింది. ఈ చేపల పులుసు ప్రభాస్‌కి నోరూరుతుందట. 

మరోవైపు కృష్ణంరాజు సైతం చేపల పులుసుని కలుపుతున్న వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. `వీకెండ్‌ స్పెషల్‌.. ఈ రోజు మా ఫ్యామిలీకి చేపల పులుసు చేయడానికి టైమ్‌ తీసుకున్నా` అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ప్రస్తుతం కృష్ణంరాజు.. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `రాధే శ్యామ్‌` చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతుంది.