పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్థుతం రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. 2019 ఎన్నికలు ముగిసే వరకు ఆయన సినిమాల వైపు చూసే అవకాశం లేదు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసిన తర్వాత మహేష్ బాబు సోదరి మంజుల ఓ సంచలన ప్రకటన చేశారు.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తాను ఒక కథ రాసుకున్నాను అని, ఈ చిత్రానికి ‘పవన్' అనే టైటిల్ కూడా పెట్టుకున్నట్లు మంజుల తెలిపారు. మంజుల ఈ ప్రకటన చేయడంతో అందరిలోనూ ఆశ్చర్యం నెలకొంది. పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తున్నాను అని గతంలో చెప్పారు. దాని సంగతి ఏమైంది? అనే ప్రశ్నకు మంజుల స్పందించారు. మా నాన్నగారు, నా సోదరుడు మహేష్ తర్వాత నేను మెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, మనసు ఏది చెబుతుందో అదే చేస్తారు, నిజాయతీ కలిగిన వ్యక్తి అంటూ మంజుల కొనియాడారు. తన తాజా మూవీ ‘మనసుకు నచ్చింది' ప్రమోషన్లో మంజుల ఈ కామెంట్స్ చేశారు.

 

నేను రాసుకున్న కథ పవన్ కళ్యాణ్ ఒక్కసాకరి వింటే చాలు, ఆయనకు ఈ కథ తప్పకుండా నచ్చుతుంది. ఆయన ఈ కథను కాదనలేరు. అంతగొప్పగా ఉంటుంది అంటూ మంజుల మీడియా ముఖంగా ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరని నాకు తెలుసు. కానీ, ఈ ఒక సినిమా చేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. కథ వినమని ఆయనకు చెప్పండి అంటూ... మీడియా ప్రతినిధులనుద్దేశించి మంజుల వ్యాఖ్యానించారు.

 

మంజుల దర్శకత్వంలో ‘మనసుకు నచ్చింది' సినిమా తెరకెక్కింది. సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ హీరో హీరోయిన్లు. ఆనంది ఆర్ట్స్‌, ఇందిర ప్రొడక్షన్స్‌ పతాకాలపై పి.కిరణ్‌, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించారు. రధన్‌ బాణీలు సమకూర్చారు. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన రావడంతో స్పందించారు. ఇటీవలే ‘మనసుకు నచ్చింది' ట్రైలర్ విడుదలైంది. పెళ్లి కూతురు(హీరోయిన్) పెళ్లి కొడుకు(హీరో)ను పెళ్లి పీటల మీద నుండి లేపుకుపోయే సీన్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇలాంటి కాన్సెప్టుతో తెలుగులో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ట్రైలర్ చూస్తుంటే మంజుల కథను చాలా కొత్తగా రాసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఫాలో యువర్ హార్ట్ 'ఫాలో యువర్ హార్ట్' అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. మంజుల ఎప్పటి నుండి తనను తాను నిరూపించుకోవాలని ఆశ పడుతోంది. ఈ సినిమా ద్వారా ఆమె లక్ష్యం నెరవేరడం ఖాయం అనిపిస్తోంది.