శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ, వరలక్ష్మి నటించిన `కోట బొమ్మాళి` పొలిటికల్ థ్రిల్లర్‌గా మెప్పించింది. ఇప్పుడు డిజిటల్ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. 

ఇటీవల కాలంలో చిన్న సినిమాల్లో మంచి ఆదరణ పొందిన వాటిలో `కోటబొమ్మాళి` ఒకటి. పొలిటికల్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ మూవీ ఇది. శ్రీకాంత్‌ మెయిన్ లీడ్‌గా చేశాడు. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీ రూపొందింది.

ఈ సినిమా గత నెలలో(నవంబర్‌ 24న) విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోయింది. ఎలక్షన్ల ఎఫెక్ట్ గట్టిగా పడింది. దీంతో సినిమాకి పాజిటివ్‌ టాక్ ఉన్నా, కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే సంక్రాంతి పండక్కి ఎంటర్టైన్‌ చేయడానికి, మరింత థ్రిల్‌ని పంచడానికి రాబోతుంది. తాజాగా `ఆహా` ఈ విషయాన్ని ప్రకటించింది. సంక్రాంతి పండక్కి `కోటబొమ్మాళి` స్ట్రీమింగ్‌ కానుందని తెలిపింది. 

అయితే ఈ వారంలోనే ఈ మూవీ ప్రసారం కానున్నట్టు ప్రచారం జరిగింది. కానీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. ఈ లెక్కన ఈ మూవీ జనవరి 12న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. దీనిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సంక్రాంతి అంటూ టీమ్‌ ప్రకటించడం విశేషం. 

`కోట బొమ్మాళి` సినిమా విషయానికి వస్తే.. ఇది మలయాళంలో హిట్‌ అయిన `నాయట్టు` చిత్రానికి రీమేక్‌. రాజకీయ నాయకులు పోలీసులను, జనాలను ఎలా ఆడుకుంటారు, వాడుకుంటారు, కులాల పేరుతో ఎలాంటి సెంటిమెంట్‌ రగిల్చి చిచ్చు పెట్టి దాన్ని తమకు ఓట్లుగా ఎలా మలుచుకుంటారనేది ఈ సినిమాలో చూపించారు. అసలైన రాజకీయాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. అయితే పోలీస్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ లో తెరకెక్కించారు. పోలీసులు.. రాజకీయ నాయకులకు కాపాలా కుక్కులు మాత్రమే అని, చివరికి బకరా అయ్యేది వాళ్లే అని చూపించిన తీరు బాగుంది. అయితేకొన్ని లాజిక్‌ లేని సీన్లు, ల్యాగ్‌ సినిమాకి కొంత మైనస్‌గా మారాయి.