`ఆచార్య` నష్టాల సెటిల్మెంట్‌లో కొరటాల శివ వాటా ఎంతో తెలిస్తే షాకే.. చిరంజీవికి డబుల్ ?
కొరటాల శివ `ఆచార్య` సినిమా బిజినెస్‌లో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు సినిమాకి భారీ నష్టాలు రావడంతో రామ్‌చరణ్, కొరటాల శివ బయ్యర్లతో సెటిల్మెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన `ఆచార్య`(Acharya) చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవితోపాటు రామ్‌చరణ్(Ram Charan) కీలక పాత్ర పోషించారు. పూజా హెగ్డే చరణ్‌కి జోడీగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలైంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు కొరటాల శివ. సినిమా బిజినెస్‌లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. తనే భుజాన వేసుకున్నారు. సినిమాకి భారీ నష్టాలు రావడంతో రామ్‌చరణ్, కొరటాల శివ బయ్యర్లతో సెటిల్మెంట్లు చేస్తున్నారు.
సినిమాకి రూ. 120కోట్ల బిజినెస్ జరగ్గా. ఈ చిత్రం కేవలం 50 కోట్లు లోపే కలెక్లని సాధించింది. దీంతో సుమారు రూ.70కోట్లకుపైగా నష్టం(Acharya Loss) వాటిల్లింది. సినిమాని కొన్న బయ్యర్లు దాదాపు డెబ్బై శాతం నష్టపోయారు. దారుణంగా దెబ్బతినడంతో డిస్ట్రిబ్యూటర్లంతా ఇప్పుడు చిత్ర యూనిట్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిర్మాతలను, దర్శకుడు కొరటాలను నిలదీస్తున్నారు. తమకు డబ్బు వెనక్కివ్వాలంటూ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెటిల్మెంట్లు చేసే పనిలో పడ్డారు కొరటాల, రామ్‌చరణ్.
రామ్‌చరణ్.. చిరంజీవి తరఫున బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ కూడా నిర్మించారు. దీంతో తను భాగం కావాల్సి వస్తుంది. అయితే చిరంజీవి విదేశాలకు టూర్ వెళ్లారు. ఆయనకు ఈ విషయాలన్నీ తెలియకుండా తనే సెటిల్మెంట్లు చేస్తున్నారట చరణ్. కొరటాల సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాకి సంబంధించి నష్టాలను నివారించడానికి బయ్యర్లకి కొంత డబ్బు తిరిగిచ్చేయాలనుకుంటున్నారట. దాంట్లో భాగంగా చిరంజీవి చేత సుమారు రూ. పది కోట్లు వెనక్కి ఇప్పించాలని భావిస్తున్నారు.
మరోవైపు కొరటాల శివకి మాత్రం పెద్ద మొత్తంలోనే తిరిగిచ్చే కార్యక్రమం పడిందట. ఆయన ఏకంగా పాతిక కోట్లు బయ్యర్లకి తిరిగిచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. సినిమా సెట్ కావడంలో, బిజినెస్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో పెద్ద వాట తనకే పడిందని తెలుస్తుంది. ఇది చిరంజీవి వాట కంటే ఎక్కువే కావడం గమనార్హం. అంతేకాదు ఒక దర్శకుడు సినిమా నష్టాల్లో ఇంత మొత్తం వెనక్కి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పాలి. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతుంది.
మరోవైపు రామ్‌చరణ్ తన నెక్ట్స్ సినిమాకి సంబంధించి తక్కువ అమౌంట్‌కే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారట. చాలా వరకు చరణ్ హామీ ఇస్తున్నట్టు టాక్. అలాగే నెక్ట్స్ ఎన్టీఆర్-కొరటాల చిత్రం ఉంది. ఆ సినిమా విడుదల రైట్స్ విషయంలోనూ తక్కువ మొత్తానికే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇస్తానని దర్శకుడు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఏదేమైనా కొరటాల వంటి దర్శకుడి సినిమాకి, మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాకి ఈ స్థాయి నష్టాలు రావడం, డబ్బులు తిరిగి చెల్లించడమనేది పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇది అభిమానులను తీవ్రంగా కలచివేస్తుంది.