ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. రీసెంట్ గా పలువురు ఇండస్ట్రీ కు సంభందించిన వారు పవన్ పై పలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.  పోసాని, ఆ తరువాత రైటర్ చిన్నికృష్ణ, తరువాత కోన వెంకట్ ఇలా పలువురు పవన్ పై విమర్శలు గుప్పించారు.  ఒకప్పుడు పవన్ ను ఆకాశానికెత్తేసిన వీళ్లు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఇలా విమర్శలు గుప్పించడానికి గల కారణం ఎలక్షన్సే అని అందరికీ తెలుసు. 

అయితే వారందరి సంగతి ప్రక్కన పెడితే.. పవన్ నా సోల్ మేట్ అని ప్రకటించిన కోన వెంకట్ ఎలా విమర్శలు చేస్తారు  అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు కోన వెంకట్ కు ఏమైంది, అసలేం జరిగింది అన్న సందేహాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన ప్రెస్ కు ఓ ప్రకటన విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంటర్వ్యూలో అడిగిన సమయంలో తన నిజాయితీ గురించి, వ్యక్తిత్వం గురించి దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నిర్మొహమాటంగా చెప్పడం జరిగిందని పొలిటికల్ గా తనకి మంచి జరగాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని తనే అని చెప్పానని కానీ ఆ విషయం రాయలేదని అన్నారు. మాయావతి గారితో పొత్తు విషయంలో, తెలంగాణా విషయంలో తనను ఎవరో మిస్ గైడ్ చేశారని వాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లు స్పష్టం చేశారు.

చివరగా ఆయన మాట్లాడుతూ.. ''మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్ధిక స్థోమతలు, ఇవేవీ స్నేహానికి అడ్డుగోడలు కాకూడదు'' అంటూ పవన్ ఇష్యూపై క్లారిటీ ఇచ్చాడు.