జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచిన చిత్రం అదుర్స్. తారక్ లోని కామెడీ టైమింగ్ ను ఒక్కసారిగా బయటపెట్టిన ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అయితే ఎనిమిదేళ్ల తరువాత ఆ సినిమాకు సంబందించిన సీక్వెల్ టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా ఊహాగానాలు వచ్చినప్పటికీ అదుర్స్ యూనిట్ పెద్దగా స్పందించలేదు. 

అయితే రీసెంట్ గా ఆ అదుర్స్ సినిమాకు రచయితగా వర్క్ చేసిన కోన వెంకట్ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ లో నెటిజన్స్ తో చాట్ చేసిన కోన ఓ అభిమాని అదుర్స్ 2 చేయండి సర్ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. స్క్రిప్ట్ అయితే రెడీ అయ్యిందని చెప్పారు. దీంతో మరో కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమవుతోందని కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే  సీక్వెల్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే దర్శకుడు వినాయక్ ఇప్పుడు ఫామ్ లో లేడు. వరుస అపజయాలతో సతమతమవుతుండడంతో ఆయనకు ఎవరు అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. మరి ఎన్టీఆర్ వరకు ఆ కథ వెళితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.