రీసెంట్ గా విశ్వరూపం చిక్కులు తొలగిపోయాయని ప్రకటించిన కమల్ తాజా తమిళ రాజకీయ పరిణామాలపై కమలహాసన్ వరుస ట్వీట్లు శశికల వర్గానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన కమల్ శశికళ ప్రతినిథి పళనిస్వామి సీఎం కావడంతో కమల్ కు తప్పని చిక్కులు
జయ మరణం అనంతరం తమిళనాట జరిగిన రాజకీయాలు అంతా చూశాం. మెజారిటీ తమిళ ప్రజలు సహా దేశమంతా పన్నీర్ సెల్వం సీఎం కావాలని కోరుకున్న మాట కూడా కాదనలేని నిజం. అయితే... పన్నీర్ సీఎంగా తిరిగి ప్రమాణం చేయకుండా... చిన్నమ్మ శశికళ వర్గం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి సఫలమైంది. చిన్నమ్మ వారసునిగా... పళని స్వామి సీఎంగా ప్రమాణం చేశారు. ఇదంతా బానే వున్నా ఇప్పుడు తమిళ స్టార్ కమల్ హాసన్ కు ఇది లేని చిక్కులు తెచ్చిపెట్టింది.
సోషల్ మీడియాలో పన్నీర్ కు మద్దతుగా.. శశికళ వర్గానికి వ్యతిరేకంగా ఘాటుగా స్పందిస్తూ వచ్చిన కమల్‌హాసన్.. శశికళ వర్గానికి 'వ్యతిరేకి'గా ముద్ర వేయించేసుకున్నాడు. అసలు కమల్ కు అన్నాడీఎంకేతో ఎప్పుడూ సత్సంబంధాల్లేవు. జయలలిత జీవించి వున్నప్పుడూ ఆమెపై వివాదాస్పద కామెంట్లు చేసి.. తన 'విశ్వరూపం' సినిమాకు చిక్కులు కొనితెచ్చుకున్నాడు కమల్‌హాసన్.
తాజాగా, ఇప్పుడు మరోమారు కమల్‌హాసన్ మీద తమిళనాడులోని 'చిన్న(అ)మ్మ' వారసుడు, ముఖ్యమంత్రి పళనిస్వామి కత్తిగట్టేసినట్లే కన్పిస్తోంది. అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో, శశికళ వర్గానికి వ్యతిరేకంగా... పన్నీర్ సెల్వం వర్గానికి అనుకూలంగా ట్వీట్లతో హోరెత్తించేశాడు కమల్‌హాసన్. ముఖ్యంగా శశికళనను విమర్శిస్తూ కూడా కమల్ విరుచుకుపడ్డాడు. మొత్తం సినీ పరిశ్రమ పన్నీర్ సెల్వంకి మద్దతిచ్చినా, పళనిస్వామి ముఖ్యమంత్రి అయిపోయారు. అయినా, కమల్ ట్విట్టర్‌లో కమెంట్స్ మాత్రం ఆపలేదు.
'మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు తగు రీతిలో స్వాగతం పలకండి..' అంటూ ట్విట్టర్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చాడు కమల్‌హాసన్. ఇలా వెటకారంగా కమెంట్ చేయడంపై మండిపడుతూ.. 'ఇండియన్ దేశీయ లీగ్' పేరుతో కమల్ హాసన్ మీద కేసులు నమోదయ్యాయి.
ఇక కమల్ ట్వీట్ల ప్రభావం ఆయన తదుపరి సినిమాలపైనా పడుతుంది. అయితే... 'విశ్వరూపం-2' సినిమాకి అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయనీ, త్వరలో సినిమాని విడుదల చేస్తానని ఈ మధ్యనే కమల్ ప్రకటించాడు. 'విశ్వరూపం'కి సీక్వెల్ ఇది. అప్పట్లో 'విశ్వరూపం' ఎదుర్కొన్న రాజకీయ వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అవే వివాదాలు ఇప్పుడు 'విశ్వరూపం-2'ని వెంటాడేందుకు కమల్ ట్వీట్స్ మరింత ఆజ్యం పోశాయని చెప్పకతప్పదు. మరి విశ్వరూపం చూపిస్తాడో లేదో చూడాలి.
