'చనిపోయేటప్పుడు కూడా యాక్షన్ అని చెబుతూ చనిపోవాలి' అని కోడి రామకృష్ణ మనసులో ఒక లైన్ బలంగా పాతుకుపోయింది. అలాగే సినిమాకు డబ్బులు పెట్టె నిర్మాతకు నష్టం రాకూడదని ఆయన మనసులో బలంగా ఉండేది. అందుకే ఒక సినిమా ఫెయిల్ అయినా మరో సినిమాతో నిర్మాతకు మంచి హిట్ ఇచ్చేవారు. 

ఈ విషయాలు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఆయనంటే అమితమైన గౌరవం. అయన మరణం ప్రతి ఒక్కరిని ఎంతో మనోవేదనకు లోను చేస్తోంది. అయితే కోడి రామ కృష్ణ 2016లో చివరగా చేసిన చిత్రం నాగరహవు. రెండేళ్ల గ్యాప్ రావడంతో సినిమాలు చేయాలనీ మూడు కథలను సిద్ధం చేసుకున్నట్లు కోడి రామకృష్ణ పెద్ద కూతురు దివ్యా దీప్తి తెలిపారు. 

ఆమె మాట్లాడుతూ.. నాన్నగారి దగ్గర నేను 2002 నుంచి 2007 వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ సమయంలో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నా. అయితే పెళ్లి తరువాత లైఫ్ బిజీగా మారిపోవడంతో డైరెక్షన్ చేయడం కుదరలేదు. కానీ తప్పకుండా సినిమా తీస్తాను అని మీడియాకు తెలిపారు. నాన్నగారు రాసుకున్న మూడు కథలు రెడీగా ఉన్నాయని అయితే వాటిని చేయగలనని తనకు నమ్మకం కలిగితేనే టచ్ చేస్తాను అని చెబుతూ లేకుంటే వాటి జోలికి వేళ్ళను అని వివరణ ఇచ్చారు. 

2012లో మొదటిసారి గుండెపోటుకు గురైన నాన్నగారు ఎన్నడు తన ఆరోగ్యం గురించి బయపడలేదు. రెండు రోజుల క్రితం హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అని అంటూ  సినిమానే ప్రాణమని ఎప్పుడు సినిమా ప్రపంచం గురించే ఆలోచించేవారని దీప్తి తెలియజేశారు.