సుదీర్ఘ షూటింగ్ తరువాత కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో 'హృద‌య‌కాలేయం' సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అప్పుడెప్పుడో వచ్చిన 'పెదరాయుడు' సినిమాకి స్పూఫ్ చేసి హిట్ అందుకున్నారు. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాకి సరైన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. జనాలు మాత్రం సినిమాను ఆదరిస్తున్నారు. కలెక్షన్ల విషయంలో కూడా సంపూర్ణేష్ బాబు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి తన సత్తా చాటుతున్నాడు.

శనివారం నాడు విడుదలైన ఈ సినిమా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. రూ.2,88,111 వసూలు చేసి సత్తా చాటింది. ఈ సినిమా కంటే ఒక్కరోజు ముందుగ రిలీజైన 'మన్మథుడు 2' సినిమాకి రూ. 2,83,950 కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన చూసుకుంటే సంపూ.. సీనియర్ హీరో నాగార్జునని మించిపోయాడనే చెప్పాలి.

అంతేకాదు.. బాలయ్య నటించిన 'మహానాయకుడు' సినిమా తొలిరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రూ 1,60,641 మాత్రమే రాబట్టగలిగింది.. నాగ్, బాలయ్యల కంటే సంపూర్ణేష్ బాబు సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం షాకిస్తోంది. ఓవరాల్ గా తొలిరోజు 'కొబ్బరిమట్ట' సినిమా రూ.60 లక్షలకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతుంది. వీకెండ్ నాటికి సినిమా రెండు కోట్లు రాబట్టింది. లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి!