ఆస్కార్ వేదికపై ఇండియన్ లేడీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ సత్తాచాటారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ తో ఆమె అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సెన్సేషన్ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
36 ఏళ్ల కార్తీకి గోన్సాల్వేస్ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఈ యంగ్ లేడీ డైరెక్టర్ తన మొదటి ప్రయత్నంలోనే ఆస్కార్ వంటి అత్యుత్తమ సినిమా పురస్కారం అందుకున్నారు. 95వ ఆస్కార్ లో ఆమె దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు సొంతం చేసుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డుకు ఎంపికైంది. ఆస్కార్ వేదికపై కార్తీకి మాట్లాడారు. తన చిత్రంలో ప్రకృతి, ప్రాణులతో మారుమూల అడవి జాతి మనుషులకుండే ప్రేమ, స్నేహం, అనుబంధాల గురించి చెప్పాలనుకున్నట్లు వెల్లడించారు.
ట్రైబల్స్, యానిమల్స్ ఎమోషన్స్ కెమెరాలో సహజంగా బంధించి చూపించినందుకు దర్శకురాలు కార్తీకిని అభినందిస్తున్నారు. 41 నిమిషాల ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ తమిళనాడు ముదిమలై నేషనల్ పార్క్ లోని ప్రకృతి అందాలు ఆవిష్కరిస్తుంది. ఆడియన్స్ రఘు, బొమ్మ, బెల్లి పాత్రలతో ప్రయాణం చేసేలా చేస్తుంది. ఎలిఫెంట్ తో ఓ కుటుంబానికి ఏర్పడిన అనుబంధాన్నే కాకుండా మారుమూల ప్రజల సంస్కృతి, జీవన విధానం తెలియజేస్తుంది.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో ఏం చెప్పారంటే... మూడు నెలల వయసున్న ఏనుగు పిల్ల రఘు తన తల్లికి దూరం అవుతుంది. అనాధ అయిన ఆ పిల్ల ఏనుగు సంరక్షణ బాధ్యత అడవి తెగకు చెందిన బొమ్మ, బెల్ల తీసుకుంటారు. చిన్నప్పటి నుండి బొమ్మ, బెల్లతో పెరిగిన రఘు వారి ఫ్యామిలీ మెంబర్ అవుతుంది. వారితో విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తల్లి నుండి విడిపోయి బొమ్మ, బెల్లికి దగ్గరైన రఘు వాళ్ళకు దూరం కావాల్సి వస్తే ఎలాంటి పరిస్థితి నెలకుంటుందనేది హృద్యంగా చూపించారు.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ కోసం దర్శకురాలు కార్తీకి ఏళ్ల తరబడి పరిశోధన చేశారు. మనుషులకు, ఏనుగుకు మధ్య అనుబంధాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కార్తీకి గతంలో యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్స్ లో కెమెరా ఆపరేట్ గా పని చేశారు. ఈ అనుభవం ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు ఉపయోగపడింది. ముదుమలై నేషనల్ పార్క్ పై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. కారణం కార్తీకి పుట్టి పెరిగిన ప్రాంతం అదే. నీలగిరి కొండల్లో గల ఊటీ కార్తీకి బర్త్ ప్లేస్. ఆ ప్రాంతంతో తనకున్న అనుభవాలు డాక్యుమెంటరీలో అద్భుతంగా ఆవిష్కరించగలిగారు.
కార్తీకి గోన్సాల్వేస్ 1986 నవంబర్ 2న తమిళనాడులో గల ఊటీలో జన్మించారు. ఆమె తండ్రి తిమోతీ ఎ. గోన్సాల్వేస్ ప్రొఫెసర్, కంప్యూటర్ సైంటిస్ట్. కార్తీకి కోయంబత్తూర్‌లోని డాక్టర్ జి ఆర్ దామోదరన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. భవిష్యత్ లో కార్తీకి మరిన్ని గొప్ప చిత్రాలు అందిస్తారని పలువురు అభిప్రాయం వెల్లడిస్తున్నారు.