పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఆ చిత్రాల దర్శక నిర్మాతలు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బాలీవుడ్ సూపర్‌ హిట్ పింక్‌ సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు.

తాజాగా పవన్‌ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను కూడా వదిలారు. వకీల్ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు పవన్‌. తాజాగా ఆ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. సినిమా ప్రీలుక్‌తో పాటు దాదాపు 15 రోజుల షూటింగ్ పూర్తయినట్టుగా తెలిపాడు క్రిష్. ఈ సినిమాలో పవన్‌ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతుండగా ప్రీ లుక్‌ చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

చాలా కాలం తరువాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నాడు. సాయి మాధవ్‌ బుర్రా మాటలు రాస్తున్నాడు. ఈ ప్రీలుక్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన `#PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు  అందుకుంటుండాలని ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ ట్వీట్  చేశాడు క్రిష్‌.