కర్ణాటకలో నేను బీజేపీకి ప్రచారం చేస్తాను.. కానీ పోటీ మాత్రం చేయడం లేదు: కిచ్చా సుదీప్ కీలక కామెంట్స్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే సుదీప్ బీజేపీలో చేరనున్నట్టుగా కూడా వార్తలు రాగా.. ఆ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. అలాగే తాను ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. కష్టకాలంలో బీజేపీ తనకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. కష్టకాలంలో బీజేపీ తనను ఆదుకుందని.. ఇప్పుడు వారికి సపోర్టు చేస్తానని తెలిపారు.
అయితే తాను బీజేపీకి ప్రచారం మాత్రమే చేస్తానని ఎన్నికల్లో పోటీ చేయను అని కిచ్చా సుదీప్ మరోసారి స్పష్టం చేశారు. ఇక, కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న పోలైన ఓట్లను లెక్కింపు జరగనుంది. కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అయితే కిచ్చా సుదీప్.. బసవరాజ్ బొమ్మై, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఈ రోజు బీజేపీ చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తొలుత తెలిపాయి. కానీ సుదీప్ మాత్రం తాను బీజేపీలో చేరడం లేదని.. ఆ పార్టీ తరఫున ప్రచారం మాత్రం నిర్వహిస్తానని చెప్పారు.