కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కేజీఎఫ్' సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే.. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'కేజీఎఫ్ 2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాని తగ్గట్లే చిత్రబృందం భారీ బడ్జెట్ తో స్టార్ కాస్ట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది.

ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతోందంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి  స్థానిక కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు షూటింగ్ ని నిలిపివేయాలని సూచించింది.

దీంతో షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త లొకేషన్ల కోసం వేట ప్రారంభించింది చిత్రయూనిట్. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడైన అధీరా పాత్రలో కనిపించనున్నారు.