ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రపురి భూముల వివాదానికి సంబంధించిన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపురి భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సినీ కార్మికులు రెండు నెలలుగా నిరసన చేపడుతున్నారు. వారికి మద్దతుగా కేతిరెడ్డి పోరాటం చేస్తున్నారు. 

1994లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి టాలీవుడ్ సినిమా కార్మికుల వసతి కోసం 67 ఎకరాలు భూమిని కేటాయించారు. కానీ కమిటీ సభ్యులు అవినీతికి పాల్పడి చిత్ర పరిశ్రమకు సంబంధం లేని 2300 మందికి ఈ భూములు కేటాయించారు. ఒక్కొక్కరి వద్ద సుమారు 5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

దీనిపై రెండు నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రయోజనం లేదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో సమస్య కాబట్టి అమరావతికి వచ్చినట్లు కేతిరెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చీఫ్ సెక్రటరీకి ఈ సమస్య గురించి తెలియజేయాలనుకుంటున్నట్లు కేతిరెడ్డి తెలిపారు. 

చిత్రపురి కాలనీ భూముల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ఇదివరకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరినట్లు కేతిరెడ్డి తెలిపారు.