కరోనా వైరస్‌పై  రోజు రోజుకీ ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాతో సహా అన్ని మాధ్యమాల్లో ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు రంగంలోకి దూకింది. అయినా జనాలు ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయటం మానటం లేదు. ఇప్పుడు ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ..కరోనా వచ్చిందని, దానితో చనిపోయాడని ఓ ఫేక్ వీడియో తయారు చేసి వదిలారు. ఇప్పుడా ఫేక్ న్యూస్ ని తయారు చేసిన వారిపై కేరళ పోలీస్ లు ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లు వదిలితే చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే చెప్పారు. 

ఈ విషయమై మోహన్ లాల్ ఫ్యాన్స్ స్టేట్ సెక్రటరీ విమల్ కుమార్ మాట్లాడారు. ఆయన పోలీస్ లకు కంప్లైంట్ చేసామని, ఆ వ్యక్తిని పట్టుకున్నామని చెప్పారని సోషల్ మీడియాలో మిగతా అభిమానులకు తెలియచేసారు. అతని పేరు సమీర్. అతను ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్, వాట్సప్ లో ఈ ప్రచారం సాగించాడు. ఇతనిపై యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు.
 
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇప్పటికే ఫేక్ న్యూస్ ల విషయమై చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి వాటిపై ఉపేక్షించేది లేదని, స్ట్రైయిట్ గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఇక ఈ ఫేక్ న్యూస్ విషయంలో మీడియా, ప్రింట్, సోషల్ మీడియాకు బాధ్యత ఉందన్న సుప్రీంకోర్టు... ప్రజల్లో భయాందోళనలు కలిగించకుండా చెయ్యాలని కోరింది.  కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని... సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి 24 గంటలకు ఓసారైనా అధికారిక సమాచారాన్ని మీడియాకూ, సోషల్ మీడియాకూ రిలీజ్ చెయ్యాలని కోరింది. ఇప్పుడదే చేస్తున్నారు.