`మహానటి` సినిమాతో సౌత్ లో స్టార్ గా ఎదిగి, జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న అందం కీర్తి సురేష్. ఆమె ఏడేళ్ల  కల త్వరలో నెరవేరబోతోందట. ఆ విషయం ఆమే స్వయంగా చెప్పింది. ఇంతకీ  కీర్తిని అంతలా ఎగ్జైట్ చేసి, వెయిట్ చేసేలా చేసిన సినిమా  `వాషి`. ఈ సినిమా కీర్తికి స్పెషల్ గా మారడానికి కారణం.. దీనిని ఆమె తండ్రి సురేష్ కుమార్ నిర్మిస్తుండడమే. 

టోవినో థామస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు విష్ణు.జి.రాఘవ్ రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ డుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కీర్తి ఎమోషనల్ అయింది.  సినిమా టైటిల్‌లో మర్డర్ కేసుకు సంబంధించిన డీటేల్స్ ఉండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో కీర్తి, టొవినో థామస్ పిక్చర్స్‌ పెయింట్‌తో ఫిల్ చేసి ఉంది . కైలాశ్ మీనన్ సంగీతం సమకూరుస్తున్న సినిమాకు వినాయక్ శశికుమార్ లిరిక్స్ అందిస్తున్నారు. 

`ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైంది. తన తండ్రి నిర్మిస్తున్న సినిమాలో నటించడం అనేది ఏ ఆడపిల్లకైనా ఓ కల. అది చాలా సులభంగా నెరవేరిందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ, సులభంగా ఏదీ రాలేదు. ఈ  చిత్రం కార్యరూపం దాల్చేందుకు ఏకంగా 7 సంవత్సరాలు పట్టింద`ని కీర్తి తెలిపింది. 

ఇక కీర్తి సురేశ్ తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో దుబాయిలో బిజీగా ఉన్న భామ..మరో మలయాళం ప్రాజెక్ట్ ప్రకటించింది. మెగాస్టార్ మోహన్ లాల్ ‘మరక్కర్ అరేబియన్ సీ లయన్‌’ సినిమా ద్వారా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి..రెండో సినిమా అనౌన్స్ చేసింది.