సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన హీరోయిన్ గా నేటితరం హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించబోతుందని సమాచారం. రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ ఓ పొలిటికల్ ఫిల్మ్ రూపొందించాలని అనుకుంటున్నాడు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నట్లు టాక్.

అయితే కీర్తి హీరోయిన్ అనగానే అందరిలో ఓ ప్రశ్న మొదలైంది. డెబ్బై వయసుకి చేరువవుతున్న రజిని పక్కన పాతికేళ్ల అమ్మాయి కీర్తి సురేష్ సూట్ అవుతుందా..? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో రజినీకాంత్ ని ఎక్కువగా నడివయసున్న పాత్రల్లోనే ఎక్కువగా చూపిస్తూ వస్తున్నారు.

'కబాలి', 'కాలా' వంటి సినిమాల్లో తన వయసుకి తగ్గ పాత్రల్లో నటించారు రజినీకాంత్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'పేటా' సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్లే నటిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ కోసం కీర్తి సురేష్ ని తీసుకురావడంతో తెరపై వీరి జంట ఎబ్బెట్టుగా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తన కూతుళ్ల కంటే పదేళ్లు చిన్నదైన కీర్తి సురేష్ తో రజినీకాంత్ రొమాన్స్ ఏంటని ఈ కాంబినేషన్ పై పెదవి విరుస్తున్నారు. మరి మురగదాస్ ఎలా ఆలోచించి ఈ కాంబినేషన్ సెట్ చేయాలని అనుకుంటున్నాడో.. ఆయనకే తెలియాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది!