యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. అయితే ఈసారి బడ్జెట్ పరిమితుల్లో శ్రీనివాస్ మామిల్ల దర్శకత్వంలో 'కవచం' అనే సినిమాలో నటించాడు.

కాజల్ హీరోయిన్ గా మెహ్రీన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బెల్లంకొండ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా.. సగానికి పైగా విడుదలకు ముందే రాబట్టింది. ప్రీరిలీజ్ బిజినెస్ రూ.15 కోట్లకు పైగా జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్, మెహ్రీన్ పాల్గొని సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేశారు. పైగా ప్రమోషన్స్ లో చోటా కె నాయుడు, కాజల్ ముద్దు వివాదం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. 

ఈ సినిమాపై బెల్లంకొండకి గట్టి నమ్మకమే ఉంది. కచ్చితంగా సక్సెస్ అందుకుంటానని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు అమెరికాలో ప్రదర్శించకపోవడంతో సినిమా టాక్ బయటకి రాలేదు. ఇక్కడ మార్నింగ్ షో పడితే కానీ టాక్ బయటకి రాదు.