బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్‌ మండా అందరికీ బాగా తెలుసు.  ‘బిగ్‌బాస్‌’షోతో మరింత పాపులారిటీ పెంచుకోవటంతో ఆయన పేరు అంతటా మారు మ్రోగిపోయింది. బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి లక్షలాది మంది అభిమాలను సంపాధించుకున్న ఆయన  షో నుంచి బయటకు వచ్చాక ‘కౌశల్‌ ఆర్మీ’పేరుతో కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచాడు. ఆ తర్వాత వివాదాలను కూడా ఎదుర్కొన్నాడు. 

 కౌశల్ భార్య నీలిమపై కూడా ఆరోపణలు వ్యక్తం కాగా ఆ సమయంలో కౌశల్ మండా నీలిమ ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. తన భార్య ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని ఒక సందర్భంగా కౌశల్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా కౌశల్‌ తన భార్య గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 

 . 'ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్‌ యూ, మిస్‌ యూ నీలిమ' అంటూ సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెట్టాడు. దీంతో కౌశల్‌ భార్యకు ఏమైందంటూ ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేసింది.

"నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలాక శ్వాస సమస్యలు ఎదురయ్యాయి. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్తే వారు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారు. పెద్దగా పట్టించుకోలేదు"

"నిజానికి యూకేలో ట్రీట్‌మెంట్‌ గొప్పగా ఉంటుందనుకున్నా, కానీ ఇది నిజంగా ఓ చేదు అనుభవం. ఎమర్జెన్సీ అనగానే ఇండియాలో త్వరగా అడ్మిట్‌ చేసుకుని వైద్యం అందిస్తారు. కానీ ఇక్కడలా కాదు. ఈ విషయంలో నాకు చాలా భయమేసింది. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు.  మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఆక్సిమీటర్‌తో నా పల్స్‌ చెక్‌ చేసుకుంటున్నాను. నేను త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను" అని నీలిమ చెప్పుకొచ్చింది.