సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెలంగాణాలో అనుకున్న సమయానికి థియేటర్ లలోకి వచ్చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం సినిమాను ఇప్పుడే విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 3న సినిమాను చూసిన తరువాత తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తులు  వెల్లడించారు. ఈ క్రమంలో సినిమా ఏపీలో రిలీజ్ కాకపోవడంతో దర్శకుడు వర్మ మండిపడుతున్నారు. మరోపక్క సినీ క్రిటిక్ కత్తి మహేష్ సోషల్ మీడియాలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి పెడుతోన్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను అందరికీ చూపించాలని కత్తి మహేష్.. వైఎస్సార్ సీపీ పార్టీని కోరుతున్నారు. పరోక్షంగా ఆయన వైఎస్ జగన్ కి సలహా ఇస్తున్నారు..

''చిత్తూరులో చిత్తూరులో ఉన్నోళ్లు చెన్నైకి. అనంతపురం, కడపలో ఉన్నోళ్లు బెంగళూరుకి. కర్నూలులో ఉన్నోళ్లు పక్కనే ఉన్న కర్ణాటకకు.. విజయవాడలో ఉన్నోళ్లు సూర్యాపేటకు. ఉత్తరాంధ్రలో ఉన్నోళ్లు ఒరిస్సాకు వెళ్లి "లక్ష్మీస్ ఎన్టీఆర్" చూడాలనే బలీయమైనకోర్కెను వెలిబుచ్చుతున్నారంటూ'' పోస్ట్ లో రాసుకొచ్చాడు.

''వైఎస్సార్సీపీ ఫ్యాన్స్ కాకుండా, న్యూట్రల్ ఓటర్లకు ఈ సినిమా చూపించే బాధ్యత పార్టీ తీసుకుని ఏర్పాట్లు చేయాలని నా మనవి'' అంటూ జగన్ ని కోరాడు.

''ప్రచారానికి పెట్టే ఖర్చులో పదోవంతు పెడితే చాలు.. చంద్రబాబు గురించి మనం గొంతు చించుకొని చెప్పనక్కరలేదు'' అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఈ పోస్ట్ ని చూసిన  రామ్ గోపాల్ వర్మ స్క్రీన్ షాట్ తీసుకొని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.