Asianet News TeluguAsianet News Telugu

‘హిప్పీ’ మూవీ రివ్యూ

ఆ మధ్యన  రామ్ చరణ్ హీరోగా ఆరెంజ్ అనే సినిమా వచ్చింది. సినిమా పెద్దగా ఆడకపోయినా యూత్ చాలా మంది అందులో కాన్సెప్టు కు కనెక్ట్ అయ్యారు. 

Karthikeya's Hippi Movie review
Author
Hyderabad, First Published Jun 6, 2019, 3:00 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఆ మధ్యన  రామ్ చరణ్ హీరోగా ఆరెంజ్ అనే సినిమా వచ్చింది. సినిమా పెద్దగా ఆడకపోయినా యూత్ చాలా మంది అందులో కాన్సెప్టు కు కనెక్ట్ అయ్యారు. ప్రేమించిన అమ్మాయి పెట్టే రూల్స్, కండీషన్స్ తట్టుకోలేక పరారయ్యిపోయే ప్రేమికుడు కథ అది. చాలా మంది జీవితాల్లో ఈ ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి అది అలా గుర్తుండిపోయింది. ఇదిగో ఈ హిప్పీ దర్శకుడుకు కూడా ఆ పాయింట్ నచ్చేసినట్లుంది. దాని చుట్టూ ఓ కథ అల్లేసి మన ముందు పెట్టేసారు. అలాగని ఆరెంజ్ ని కాపీ కొట్టారని కాదు..అలాంటి సిమిలర్ పాయింట్ తో ప్రయాణం పెట్టుకుని చేసుకున్న లవ్ స్టోరి ఇది.  మరి ఈ లవ్ స్టోరీ మనవాళ్లకు పడుతుంది. పాత పిప్పే అని ప్రక్కన పెట్టేస్తారా...‘ఆర్‌ ఎక్స్‌ 100’తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన  కార్తికేయకు ఈ సినిమా మరో హిట్ ఇస్తుందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 


కథేంటి..?

బిటెక్ చేసిన హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌) మనస్సుకు ఏది తోస్తే అది చేసేసే రకం. మార్షిల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో ఉన్న అతను స్నేహ (జ‌జ్బాసింగ్‌) తో రిలేషన్ షిప్ లో ఉంటాడు. ఆమెతో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లినప్పుడు స్నేహ  స్నేహితురాలు ఆముక్త మాల్యద (దిగంగ‌న సూర్యవంశీ) పరిచయం అవుతుంది. హిప్పీ కన్ను ఆమెపై పడుతుంది. అక్కడ నుంచి ఆమెకోసం వెంపర్లాట ప్రారంభమవుతుంది. స్నేహను ప్రక్కన పెట్టి ఆముక్తమాల్యద ని పడేయాలని ఆమె చుట్టూ  ప్రదక్షణ చేస్తూంటాడు. విషయం అర్దమైన స్నేహ ఇన్నాళ్లూ హిప్పీకి తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని ప్రక్కకు తప్పుకుని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. 

ఇక ఆ అడ్డం కూడా తప్పుకోవటంతో ...  హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతారు. ఇద్దరూ సహజీవనం ప్రారంభిస్తారు.  అప్పటినుంచీ ఆముక్త మాల్యద డామినేషన్ స్టార్టవుతుంది. ఆమె తన రూల్స్,కండీషన్స్  తో హిప్పీకు నరకం ఏంటో చూపెడుతుంది.  స్వేచ్చగా ఉండాలనుకునే హిప్పీకు స్వర్గం చేజారినట్లు అనిపిస్తుంది. దాంతో వీరిద్దరి మధ్యా అభిప్రాయ భేధాలు వస్తాయి. ఆమెను వదిలించుకోవాలని హిప్పీ భావిస్తాడు. మరో అమ్మాయి (శ్రద్దా దాస్ ) పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇంతకీ హిప్పీ, ఆముక్త మాల్యద బ్రేకప్ అయ్యిందా...మధ్యలో ఈ శ్రద్దాదాస్ ఎవరు..కథలో జెడి చక్రవర్తి పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
  
 ఎలా ఉందంటే..?

నిజానికి తెలుగు తెరకు మాత్రమే కాదు..ఏ తెరకైనా కొత్త పాయింట్ కాదు. అయితే రొమాంటిక్ కామెడీలన్నీ చాలాభాగం ఇలాగే ఉంటాయి కాబట్టి ..కేవలం ట్రీట్మంట్ ఎలా చేసారు అనేది మాత్రమే చూస్తాం. అయితే ఆ విషయంలోనే దర్శకుడు ఫెయిలయ్యాడు. ఇంత చిన్న పాయింట్ ని పెద్దగా రెండున్నర గంటల సినిమాగా విస్తరించటంలో  సక్సెస్ కాలేకపోయాడు. అప్పటికీ స్నేహ, హిప్పీల  మధ్య రొమాన్స్‌ తెర మీద హాట్ హాట్‌గానే పండించి ఆ లోటు మనకు తెలియనివ్వకుండా ఉంచాలని చూసాడు.  కానీ విషయం లేకుండా విస్తరణ ఎంతవరకూ జరుగుతుంది. కథలో వేరే సబ్ ప్లాట్స్ పెట్టుకుంటే కొంతవరకూ ఈ సమస్య నుంచి సేవ్ అయ్యేవారేమో. అలాగే సినిమాలో అసభ్యకరమైన పదాలు,సన్నివేశాలు యూత్ కు ఎంతవరూ పడతాయో కానీ చూసేటప్పుడు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాయి. వెన్నెల కిషోర్ తో కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది.

టెక్నికల్ గా ...

దర్శకుడు యూత్ ఫుల్ ఫిల్మ్ అంటే కేవలం ద్వంద్వార్దాలు, రొమాంటిక్ సీన్స్ అనుకోవటం దురదృష్టం. అలాగే ఆర్ ఎక్స్ 100 చూసి..దాని సక్సెస్ కు హాట్ సీన్సే కారణం అనుకుని వాటిని రిపీట్  చేసినట్లుంది. ఫస్టాఫ్ ఫరవాలేదనిపించినా, సెకండాఫ్ చాలా స్లోగా లాగ్ తో నడిపించి విసిగిస్తుంది.  ఇక ఆర్ డి రాజేష్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.  గోవాలో వచ్చే సీన్స్ చాలా అందంగా చూపించారు. పాటలు విషయానికి వస్తే.. నివాస్ కె ప్రసన్న అందించిన సాంగ్స్ ఫరవాలేదు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత కలైపులి ఎస్ థాను పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ది బెస్ట్ అన్నట్లు ఇచ్చాడు. నటుడుగా కార్తికేయ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. జెడీ చక్రవర్తి గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు..ఎందుకంటే ఆయన కొత్తగా చేసిందేమీ లేదు. 


ఫైనల్ థాట్..

 హాట్ సీన్స్ , డబుల్ మీనింగ్ లు  పాత పిప్పి కథని గెలిపించలేవు

Rating: 2/5
 

ఎవరెవరు..

నటీనటులు:కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జజ్బాసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు
సంగీతం: నివాస్‌ కే ప్రసన్న
సినిమాటోగ్రఫీ: రాజశేఖర్‌
కూర్పు: ప్రవీణ్‌ కేఎల్
నిర్మాణ సంస్థ: వీ క్రియేషన్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీఎన్‌ కృష్ణ
విడుదల తేదీ: 6-06-2019

Follow Us:
Download App:
  • android
  • ios