ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌ కు కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆయన చేసిన "కన్నడం తమిళం నుంచే పుట్టిన భాష" అనే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కోర్టు, భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని హితవు పలికింది.

కమల్ హాసన్ కు కోర్టు అక్షింతలు

కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్డు లో ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కర్నాటకలో తన సినిమా రిలీజ్ కు క్లియరెన్స్ ఇవ్వాలని, సెక్యుూరిటీ కూడా ఇవ్వాలంటూ కమల్ వేసిన పిటీషన్ పై విచారించిన కోర్డు, స్టార్ హీరోకు అక్షంతలు వేసింది. స్వేచ్చ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఘాటుగా స్పందించింది.

కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. ‘‘మీరు సామాన్యులు కారు. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ దాన్ని ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు వినియోగించరాదు. మీరు చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడినట్లయితే, మీ సొంత నిర్ణయంతో క్షమాపణ చెప్పండి’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.

కమల్ హాసన్ పై కన్నడ సంఘాల ఆగ్రహం

కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ విడుదల నేపథ్యంలో ఈ వివాదం ముదిరింది. జూన్ 5న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) ఈ చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించింది. కమల్ క్షమాపణ చెప్పే వరకు సినిమా ప్రదర్శనకు అనుమతి ఉండదని కేఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఎం.ఎం. నరసింహులు తెలిపారు.

ఈ నిషేధంపై స్పందించిన కమల్ హాసన్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమా స్క్రీనింగ్‌కు భద్రత కల్పించాలని, నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు, "కర్ణాటక ప్రజలు సినిమాను తిరస్కరిస్తే, ఆ ఆదాయాన్ని వదులుకోవాల్సి వస్తుంది" అని వ్యాఖ్యానించింది.

క్షమాపణ చెప్పేది లేదన్న కమల్ హాసన్

కమల్ గత వారం ఇచ్చిన ప్రకటనలో, తాను తప్పు చేయలేదని, కాబట్టి క్షమాపణ చెప్పే అవసరం లేదని స్పష్టం చేశారు. కమల్‌ హాసన్‌ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ‘‘ప్రేమతోనే అలా మాట్లాడాను, ప్రేమ ఎప్పుడూ క్షమాపణలు చెప్పదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. భాషా చరిత్రపై తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి ద్వేషము లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక తమిళనాడులో డీఎంకే మద్దతుతో రాజ్యసభకు వెళ్లనున్న కమల్, ఇటీవల థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదంపై ఉత్కంఠ నెలకొంది. కామెంట్స్ వెనక్కి తీసుకోవాలా? క్షమాపణ చెప్పాలా? లేదా సినిమా రద్దవుతుందా? అన్న చూడాలి.