`కాంతార` ఆస్కార్‌కి నామినేట్ కాకపోవడంపై నిర్మాత స్పందన.. `కాంతార 2 రిలీజ్ డేట్
కన్నడ సంచలనం `కాంతార` సినిమా ఇండియన్ బాక్సాఫీసు ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ కి నామినేట్ కాకపోవడంపై, కాంతార 2 అప్‌డేట్ ఇచ్చారు.

గతేడాది వచ్చిన సంచలన చిత్రాల్లో `కాంతార` ఒకటి. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసింది. మొదట కేవలం కన్నడలోనే విడుదలైన ఈ చిత్రం అక్కడ విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో పది రోజుల తర్వాత తెలుగుతోపాటు ఇతర భాషల్లో డబ్ అయి విడుదలైంది. అన్ని భాషల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విశేష ఆదరణతోపాటు భారీ కలెక్షన్లని సాధించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా నాలుగు వందల యాభై కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. పది రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. దక్షిణ కర్నాటకకి చెందిన భూత కోల అనే సాంప్రదాయ కళ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నేచురాలిటీకి దగ్గరగా ఉండటం, సాంప్రదాయ పండుగ ఉండటం, ఆధ్యాత్మిక అంశాలు, పేదవాళ్లను సంపన్నులు దోచుకోవడం, కులాల మధ్య వ్యత్యాసాలను ఆవిష్కరించిన ఈ చిత్రానికి జనం బ్రహ్మరథం పట్టారు. అందుకే ఇది భారీ విజయాన్ని సాధించింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రం ఆస్కార్‌కి షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగంలో ఆస్కార్‌కి పంపబడింది. కానీ నామినేట్ కాలేదు. తాజాగా దీనిపై నిర్మాత కిరగందూర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాంతార సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యిందని, అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయం లోపు ప్రచారం చేయలేకపోయామని తెలిపారు. సరైన ప్రచారం లేకపోవడం వల్లే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ కాలేకపోయిందన్నారు. అయితే ఆ లోటుని `కాంతార2` తీరుస్తుందన్నారు.
ఈ సందర్భంగా `కాంతార2`కి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత విజయ్ కిరగందూర్. రెండో భాగానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమయ్యిందన్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది(2024) చివర్లో `కాంతార 2`ని రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే ఆ సినిమాని పక్కా ప్రణాళికతో అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తామని వెల్లడించారు. టార్గెట్ ఆస్కార్ అని పరోక్షంగా వెల్లడించారు నిర్మాత.
`కాంతార`కి దక్కిన ఆదరణపై ఆయన రియాక్ట్ అవుతూ కరోనా తర్వాత సినిమా పరిశ్రమలో, ఆడియెన్స్ లో వినూత్నమైన మార్పులు వచ్చాయన్నారు. ఓటీటీకి అలవాటు పడ్డారని, అనేక రకాల కంటెంట్‌ని ఆడియెన్స్ ఇంట్లో కూర్చొని చూస్తున్నారని, అందుకే కంటెంట్ ప్రధానమైన, కల్చర్ నేపథ్య చిత్రాలకు బాగా ఆదరణ దక్కుతుందని చెప్పారు. `కాంతార`, `ఆర్‌ఆర్‌ఆర్` వంటి సినిమాల విషయంలో అదే జరిగిందని, ఆడియెన్స్ టేస్ట్ కి తగ్గట్టు ఇప్పుడు మేకర్స్ మారాల్సి ఉందని, ఆ తరహా కంటెంట్‌ని అందివ్వాల్సి ఉంటుందన్నారు. `కాంతార` ద్వార తుళు కల్చర్‌ని చూపించామని, ఇకపై అలాంటి కథలపైనే తాను ఫోకస్ చేస్తున్నట్టు చెప్పారు విజయ్ కిరగందూర్. ప్రస్తుతం తెలుగులో `సలార్` చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దీనికి దర్శకుడు.