మహారాష్ట్ర ప్రభుత్వంతో, బ్రిహన్‌ ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ)తో చేస్తున్న పోరాటంలో కంగనా విజయం సాధించింది. కోర్ట్ తీర్పు ఆమెకి అనుకూలంగా వచ్చింది. భవనం కూల్చివేత కేసులో పెద్ద ఊరట లభించింది. ముంబయిలోని బాంద్రాలో గల కంగనా ఆఫీస్‌ని బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని ముంబయి హైకోర్ట్ తీవ్రంగా తప్పుపట్టింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని బీఎంసీ అధికారుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. 

పిటిషనర్‌కి జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతోపాటు ముంబయిని పీఓకేతో పోలుస్తూ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల ఫలితంగా బాంద్రాలోని కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీఎంసీ అధికారుల నిర్ణయాన్నీ సవాల్‌ చేస్తూ కంగనా ముంబయి హైకోర్ట్ ని ఆశ్రయించింది. దీంతో కూల్చివేతపై హైకోర్ట్ స్టే విధించింది. సుదీర్ఘ వాదనల విన్న హైకోర్ట్ శుక్రవారం తుది తీర్పుని వెలువరించింది. 

ఈ సందర్భంగా కంగనా స్పందిస్తూ `ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి గెలిచినప్పుడు, అది వ్యక్తి విజయం కాదు, ప్రజాస్వామ్య విజయం అవుతుంది. నాకు ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, విరిగిన నా కలలను చూసి నవ్వుకున్న వారికి ధన్యవాదాలు. మీరు విలన్‌గా నటించడానికి ఏకైక కారణం నేను హీరో కావడమే` అని తెలిపింది.