ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని నిర్మించిన విష్ణు ఇందూరి త్వరలో తలైవి జయలలిత బయోపిక్ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అలాంటి పొరపాట్లు జయలలిత బయోపిక్ చిత్రంలో రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. తమిళుల అభిమాన నాయకురాలు జయ కథని చక్కగా ప్రజెంట్ చేస్తే అద్భుత చిత్రం అవుతుంది. ఎందుకంటే జయలలిత జీవితం మొత్తం పోరాటాలతో కూడుకున్నది. 

తాజాగా చిత్ర యూనిట్ జయలలిత బయోపిక్ కి సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించింది. ఈ చిత్రం కోసం తెరవెనుక భారీ కసరత్తే జరుగుతోంది. ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. జయలలిత పాత్రలో ఒదిగిపోయేందుకు బరువు పెరుగుతోంది. 

ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తలైవి అనే టైటిల్ ఖరారు చేసారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హిందీలో ఈ చిత్రానికి జయ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

తాజా చిత్ర యూనిట్ అందించిన సమాచారం మేరకు.. ఈ చిత్రంలో కంగనా రనౌత్ జయలలితగా నాలుగు టైం పీరియడ్స్ లో, నాలుగు లుక్స్ లో కనిపించనుంది. కంగన రనౌత్ ని అచ్చు జయలాగా చూపించేందుకు ప్రముఖ హాలీవుడ్ మేకప్ మ్యాన్ జాసన్ కొలిన్స్ రంగంలోకి దిగుతున్నాడు. కెప్టెన్ మర్వెల్, బ్లేడ్ రన్నర్ లాంటి చిత్రాలకు జాసన్ మేకప్ మ్యాన్ గా పనిచేశాడు.

జయలలిత బయోపిక్ చిత్ర షూటింగ్ దీపావళి తర్వాత ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పురుచ్చితలైవి, అమ్మ అని తమిళులు ముద్దుగా పిలుచుకునే జయలలిత సీఎంగా ఉండగానే 2016 డిసెంబర్ 5న అనారోగ్యంతో మరణించారు.