గత కొంత కాలంగా కంగనా రనౌత్ బాలీవుడ్ లో నెపోటిజం, వారసత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కంగనా చేస్తున్న విమర్శలకు ఆమె సోదరి రంగోలి కూడా తోడైంది. కంగనా రనౌత్ పై వస్తున్న ప్రతి విమర్శని తిప్పి కొడుతూ రంగోలి ఘాటుగా సమాధానాలు ఇస్తోంది. ప్రస్తుతం కంగనా రనౌత్ మెంటల్ హై క్యా అనే చిత్రంలో నటిస్తోంది. జులైలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. 

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకుడు. రాజ్ కుమార్ రావు, కంగనా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ప్రకాష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో కంగనా తనకు సలహాలు, సూచనలు అందించిందని,కొంతభాగం దర్శకత్వం కూడా చేసిందని తెలిపాడు. అందులో తప్పేమి లేదని కంగానని సమర్థించాడు. 

కంగనా చివరగా నటించిన మణికర్ణిక చిత్రం విషయంలో కూడా దర్శకుడు క్రిష్ తో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. క్రిష్ ఆ చిత్రం మధ్యలోనే తప్పుకున్నాడు. దీనితో కంగనా రనౌత్ దర్శకులపై పెత్తనం చలాయిస్తోందనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శలపై ఆమె సోదరి రంగోలి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఏమి తెలియని స్టార్ వారసులతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడు భావించడు. తప్పని పరిస్థితుల్లో కొందరు దర్శకులు స్టార్ వారసులతో సినిమాలు చేయాల్సి వస్తుంది. 

అన్ని విషయాలపై అవగాహన ఉండి, తమకు సాయం అందించే నటులతో సినిమాలు చేయాలని భావించే దర్శకులు కూడా ఉంటారు. బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం, వారసత్వ ప్రభావం చూసి దక్షణాది యువ దర్శకులు బాలీవుడ్ లోకి అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు అని రంగోలి వ్యాఖ్యానించింది. ఆలా భయపడే వారికి కంగనా రనౌత్ ధైర్యాన్ని ఇస్తోంది. 

కంగనా రనౌత్ ని అలియా భట్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోల్చవద్దు. ఎందుకంటే కంగనా రనౌత్ వారిలా పేరున్న దర్శకులతో ఎప్పుడూ పనిచేయలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. తన సొంత ప్రతిభ, కష్టంతోనే నటిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. మీరంతా అంటున్న ఆ స్టార్ హీరోయిన్లు.. హీరోలు కనుసైగ చేస్తే తోక ఊపుకుంటూ వెళ్లే రకాలు.. కానీ కంగనా రనౌత్ ఎవ్వరికి తలవంచే రకం కాదు అంటూ రంగోలి ఘాటు వ్యాఖ్యలు చేసింది.