హిందీలో అనేక టీవీ సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాల్వి మల్హోత్రా. ఈమెకు ఫేస్‌బుక్ లో కుమార్ మహిపాల్ సింగ్ అనే అతను పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతను కొన్ని రోజులుగా మాల్వీని సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోమంటూ వేధిస్తున్నాడు. అయితే మాల్వీ మాత్రం అతని ప్రేమను తిరస్కరించింది. దాంతో ఆమెపై పగ పెంచుకున్న అతను అదును చూసి ఆమె పై సోమవారం రాత్రి కత్తితో దాడి చేసాడు. 

మాల్వీ మల్హోత్రా సోమవారం ఓ షూటింగ్ ముగించుకొని ముంబాయి వెర్సోవా ప్రాంతంలో ఓ కేఫ్ నుంచి ఆమె ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. కుమార్ మహిపాల్ సింగ్.. సదురు మాల్వీ మల్హోత్రాను కారులోంచి చూసి ఆమెను అడ్డడించాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని ఆమెతో వాదనకు దిగాడు. ఆ తర్వాత మాట మాట పెరగడంతో కోపంతో అప్పటికే రగిలిపోయిన అతను .. మాల్వీపై పొట్టలో చేతులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. 

గాయాల పాలైన ఆమెను కోకిలబెన్ అంబానీ  హాస్పిటల్‌కు తరిలించారు. పోలీసులు అక్కడ సీసీ టీవీ కెమెరా ఫుటేష్ ఆధారంగా ఆమెపై దాడికి పాల్పడింది కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి అని నిర్ధారించారు. ఇతను కూడా చిత్ర పరిశ్రమలో ఓ ప్రొడ్యూసర్ అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అతనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 హత్నాయత్నం, నిర్భయ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
ఈ నేపధ్యంలో మహిళా కమిషన్,  కంగనా రనౌత్ సాయం కోరుతూ కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్ నుండి మల్వి ​​మల్హోత్రా మొబైల్ వీడియో మెసేజ్ ని విడుదల చేశారు. “నేను కూడా కంగనా  స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుండి వచ్చాను. ముంబైలో నన్ను ఇలా దాడి చేస్తారని నేను అనుకోలేదు. నాకు మద్దతు ఇవ్వండి” అని మాల్వి కోరారు.

దీంతో రంగంలోకి దిగిన కంగన ట్విట్టర్ వేదికగా మాల్వి మల్హోత్రాకు మద్దతుగా నిలిచింది. వెంటనే నిందితుడిని కష్టడీలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీబీ చైర్మన్ రేఖ శర్మని కోరింది. తనని  తాను నిర్మాతగా పరిచయం చేసుకున్న యోగేష్ మహీపాల్ సింగ్ ని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

`ఇది సినీ పరిశ్రమ యొక్క నిజస్వరూపం. సరైన సంబంధాలు.. ఎలా వెళ్లాలో తెలియక సఫర్ అవుతున్న వాళ్లకు ఇది తరచూ జరుగుతోంది. వారసత్యం  బంధుప్రీతి పక్షపాతం వున్న పిల్లలు తమకు కావలసినంతగా తమను తాము రక్షించుకోవచ్చు. కాని వారిలో ఎంతమందిని పొడిచి అత్యాచారం చేసి చంపారు?.. అని కంగన ప్రశ్నిస్తోంది.

ప్రియమైన మాల్వి నేను మీతో ఉన్నాను. మీరు క్రిటికల్ గా ఉన్నారని నేను చదివాను. ప్రియమైన అమ్మాయి మీ కోసం ప్రార్థిస్తున్నాను. రేఖగారు అపరాధిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మేము మీతో ఉన్నాము. మేము మీకు న్యాయం చేస్తాము. దయచేసి విశ్వాసం కలిగి ఉండండి` అని ట్వీట్ చేసింది కంగన.