బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. సుశాంత్‌ సింగ్ మృతితో మొదలైన వివాదం ఇప్పుడు కంగన వర్సెస్‌ శివసేనగా మారిపోయింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కంగనాకు భద్రత కల్పించటంతో ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో కంగన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబైని పీవోకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

దీంతో శివసేన ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ముంబైలోని కంగన ఆఫీస్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ ఆఫీస్ బిల్డింగ్‌లను కూల్చేసే ప్రయత్నం చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. శివసేన కార్యకర్తలు కంగన ముంబై రావద్దంటూ నిరసనలు తెలపటంతో కంగన ఎవరాపుతారో చూస్తా అంటూ సవాల్ చేసి ముంబై వచ్చింది. కూలిన ఆఫీస్‌ బిల్డింగ్‌ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తానంటూ ప్రకటించటంతో పాటు వివాదాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లింది.

తాజాగా ఈ బ్యూటీ తిరిగి మనాలి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు ముంబైలో హడావిడి చేసిన కంగనా బరువెక్కిన హృదయంతో ముంబై విడిచి వెళుతున్నా అంటూ ట్వీట్ చేసింది. `నా మీద వరుస దాడులు, వేదింపులు, నా ఇళ్లు, కార్యాలయాలను కూల్చే ప్రయత్నాలు నన్ను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. ముంబైలో ఉన్నన్ని రోజులు నాకు ఎదురైన అనుభవాలు, నా చుట్టూ భారీ భద్రత చూస్తే నేను చేసిన వీవోకే వ్యాఖ్యలు నిజమే అనిపిస్తుంది` అంటూ కామెంట్ చేసింది కంగనా.