బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ చాలా స్పీడుగా ఉంది. ముందరి కాళ్లకే బంధం వేస్తోంది.  తన తాజా చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయకూడదని కండీషన్  చెప్తోంది. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. క్రిష్‌ జాగర్లమూడి, కంగన కలిసి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రానికి కథ ఇచ్చింది రాజమౌళి తండ్రి అయిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌. దాంతో మళ్లీ తెలుగులో ఈ కథను తెరకెక్కిస్తారేమో అని డౌట్ తో ముందే క్లారిటీ ఇచ్చేస్తోంది. 

రీసెంట్ గా కంగన ఈ చిత్ర పబ్లిసిటీ క్యాంపైన్ లో  భాగంగా  హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా తన సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ‘సౌత్ లో  ఉన్న నిర్మాతలు కానీ దర్శకులు కానీ ‘మణికర్ణిక’ సినిమాను రీమేక్‌ చేయకూడదు. ఇప్పటికే నేను నటించిన ‘క్వీన్’ సినిమాను నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. మేం ‘మణికర్ణిక’ను తెలుగు, తమిళంలో డబ్బింగ్‌ చేస్తున్నాం. ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా’ అని వెల్లడించారు.

ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు. ‘లక్ష్మీబాయి అనే నేను..ఝాన్సీ ప్రాంతాన్ని కాపాడతానని మాటిస్తున్నాను’ అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 

ఇందులో లక్ష్మీబాయికి సన్నిహితురాలైన ఝల్కరీబాయి పాత్రలో బుల్లితెర నటి అంకితా లోఖాండే నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ రూ.125 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ త్రయం సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.