బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) గంగూబాయి కతియావాడి చిత్రంపై సెటైర్లు పేల్చింది. స్టార్ కిడ్స్ అంటే మండిపడే కంగనా హీరోయిన్ అలియా భట్ ని టార్గెట్ చేస్తూ వాడి వేడి కామెంట్స్ చేసింది.

 సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi) ఫిబ్రవరి 25న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ మూవీని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. “ఈ శుక్రవారం, బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైనట్లే. రొమాంటిక్ కామెడీ చేసే పాప నటించగలదని అందరూ అనుకుంటున్నారు. మూవీ మాఫియా కారణంగా బాలీవుడ్ పై హాలీవుడ్, సౌత్ సినిమాల ఆధిపత్యం పెరిగిపోయింది. ఈ సినిమా అతి పెద్ద లోపం క్యాస్టింగ్'' అంటూ కామెంట్ చేసింది. అలియా పేరు ప్రస్తావించకుండానే అసలు నటన రాని ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారంటూ ఇండైరెక్ట్ సెటైర్లు వేసింది. 

మరొక సోషల్ మీడియా పోస్టులో మూవీ మాఫియా కారణంగా చాలా మంది దర్శకులు మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు. రాబోయే కాలంలో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ మాఫియా బాధితులు అవుతారు. అంటూ మరొక కామెంట్ చేశారు. చాలా కాలంగా సినిమా వారసత్వాన్ని కంగనా వ్యతిరేకిస్తున్నారు. అవుట్ సైడర్స్ ని మూవీ మాఫియా తొక్కేస్తుందని కంగనా ఆరోపణ. ఇక దర్శకుడు మహేష్ భట్ అంటే మండిపడే కంగనా.. ఆయన కూతురైన అలియా భట్(Alia Bhatt) పై వరుసగా వివాదాస్పద కామెంట్స్ చేస్తుంది. 

ఇటీవల ఓ బాలిక గంగూబాయ్ మూవీలోని అలియా లుక్ ఇమిటేట్ చేస్తూ వీడియో చేసింది. సదరు వీడియోని కంగనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక చిన్న పిల్ల వేశ్య పాత్రను అనుకరించేలా చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న కంగనా రనౌత్ నిత్యం వివాదాల్లో ఉంటారు. మరో నాలుగు రోజుల్లో గంగూబాయ్ విడుదల ఉండగా, కంగనా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి కతియావాడి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒకప్పటి ముంబై సెక్స్ వర్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 25న తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. ఆమె రామ్ చరణ్ కి జంటగా సీత అనే పాత్ర చేశారు.