జయలలిత మరణం అనంతరం ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలు రోజుకో ట్విస్ట్ తో తమిళనాడు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన రజినీ, ఇప్పుడు కమల్ రజినీ తన పార్టీలో చేరితే కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్న కమల్
జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక జయ మరణం తర్వాత ఎప్పటినుంచో సూపర్ స్టార్ రజినీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై నెలకొన్న సందిగ్దతకు ఒక క్లారిటీ వచ్చేసింది. దసరాకు రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతలోనే సూపర్ స్టార్ రజినీయేకాక విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాలపై తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ.. మార్పు కోసం తాను కూడా సిద్ధమని, అంతా రెడీగా వుండాలని ప్రకటన చేశాడు.
ఇక కమల్ హాసన్.. రాజకీయాల్లో రావడం ఖాయమేనని సంకేతాలిచ్చాడు. వచ్చే నెలలో తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో పూర్తయిన వెంటనే రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 15) సాయంత్రం ఓ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చాలా సంతోషమని, ఆయనతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కమల్ ప్రకటించారు. పత్రికా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కమల్.. ‘నేను రజనీతో కలిసి ఎందుకు పని చేయకూడదూ..? ఇండస్ట్రీలో సినిమాల పరంగానే మా ఇద్దరి మధ్య పోటీ ఉంది. అయినా.. కీలక సమస్యలపై గతంలో ఇరువురం అనేకసార్లు చర్చించుకున్నాం. ఆయన రాజకీయాల్లోకి వస్తారంటే.. తప్పకుండా ఆయనతో మాట్లాడతా.. రజనీతో కలిసి పనిచేయడానికి నేనెప్పుడూ సిద్ధం’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటంపై ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల అభిమానులతో వరస సమావేశాలు జరిపి సుదీర్ఘంగా చర్చించినప్పటికీ రాజకీయ ప్రవేశం గురించి నేటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కమల్ మాత్రం.. సామాజిక అంశాలతో పాటు తమిళ రాజకీయాలపై మొదటి నుంచీ స్పందిస్తూనే ఉన్నారు.
ఇటీవల అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న సంక్షోభంపై, ఆ ప్రభుత్వ పనితీరుపై కమల్.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎంకేతో సాన్నిహిత్యంగా కనిపిస్తూనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు సంకేతాలిస్తున్నారు. మరోవైపు తన రంగు కాషాయం కాదంటూ బీజేపీపై పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు. మరి రజనీ కూడా రాజకీయాల్లోకి అడుగు పెడితే.. కమల్‌తో పాటు కలిసి పనిచేస్తే.. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరగడం ఖాయం.
అయితే కమల్ వ్యాఖ్యలపై రజినీ అభిమానులు ఆగ్రహంగా వున్నారు. అత్యంత ఆదరణ ఉన్న కథానాయకుడిగా.. రాజకీయాల్లోకి వస్తే అధికారం ఆయన సొంతం అన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. అలాంటి రజనీని తన పార్టీలోకి వస్తే చేర్చుకుంటానని కమల్ చెప్పటంపై రజనీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
