కమల్‌ హాసన్‌ ఇటీవల తన 232వ సినిమాని ప్రకటించారు. `కమల్‌హాసన్‌ 232` అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. లోకేష్‌ కనగరాజ్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని తన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌  నిర్మించనున్నారు. ఈ నెల 7న కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

దీనికి సంబంధించిన ఫోటో షూట్‌ ఇటీవల నిర్వహించారు. ఈ ఫోటో షూట్‌ ఫోటోని సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ జీ వెంకట్రామ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ డ్రెస్‌లో వైట్‌ హ్యాట్‌ పెట్టుకుని, గెడ్డంతో చాలా స్టయిలీష్‌గా, రొమాంటిక్‌గా కనిపిస్తున్నాడు కమల్‌. చాలా కొత్తగా ఉంది. `బిగ్‌బాస్‌` నాల్గో సీజన్‌లోనూ గెడ్డంతో కనిపిస్తున్నారు కమల్‌. ఈ ఫోటో షూట్‌లోని ఫోటోని తాజాగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌గా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం కొత్త గెడప్‌లో కనిపించనున్నట్టు టాక్‌. అన్నట్టు కమల్‌ సినిమా సినిమాకి కొత్తగా కనిపించడం సర్వసాధారణమే. ప్రతి సినిమాకి ఆయన తనలుక్‌ని మార్చేస్తుంటారు. ఇప్పుడూ అదే చేయబోతున్నటు తెలుస్తుంది. 

ఇక ప్రస్తుతం కమల్‌ నటిస్తున్న `భారతీయుడు 2` ఆల్మోస్ట్ వాయిదా పడ్డట్టే అనిపిస్తుంది. ఈ సినిమా నుంచి దర్శకుడు శంకర్‌ తప్పుకుంటున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. పైగా వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. భారీ బడ్జెట్‌, కరోనా ఎఫెక్ట్ వంటి వన్నీ ఈ సినిమాని కష్టాల్లో పడేశాయి. మరి ఈసినిమా ఉంటుందా? ఇక రద్దవుతుందా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.