`ప్రాజెక్ట్ కే`తో సంచలనాలకు తెరలేపుతున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకి కమల్ హాసన్‌ని తీసుకున్నారు. దీనిపై ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ప్రభాస్ నటిస్తున్న భారీ మూవీ `ప్రాజెక్ట్ కే`. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తున్నారు. కీలక పాత్రలో ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. తాజాగా మరో సంచలన అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. ఈ చిత్రంలో మరో సూపర్ స్టార్‌ని భాగం చేస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ `ప్రాజెక్ట్ కే`లో భాగం అవుతున్నారని ప్రకటించారు. కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడిచింది.
`భూమిని కప్పి ఉంచే నీడ మాకు కావాలి. అందుకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అతనే లోకనాయకుడు కమల్ హాసన్. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ `ప్రాజెక్ట్ కే`లో భాగం అవుతుండటం ఆనందంగా ఉంది` అంటూ ఓ స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేసింది యూనిట్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమల్‌ని తీసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలకు అవదుల్లేవని చెప్పొచ్చు. అంతేకాదు ప్రస్తుతానికి ఇండియన్ సినిమాలో రూపొందుతున్న అతిపెద్ద సినిమాగా `ప్రాజెక్ట్ కే` అవతరించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు కమల్ ఫ్యాన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు. కమల్ ఇటీవల `విక్రమ్` సినిమాతో కమ్ బ్యాక్ అయ్యారు. ఆయన `ఇండియన్ 2`వంటి భారీ సినిమాలను లైనప్‌లో పెట్టారు. ఈ క్రమంలో ఆయన ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. టైమ్ పీరియడ్ నేపథ్యంలో సినిమా సాగుతుందని, చరిత్రకి, ప్రస్తుతానికి ముడిపెడుతూ సినిమాని తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ప్రభాస్ తన సంతోషాన్ని పంచుకున్నారు. నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం అంటూ ఆయన ఎమోషనల్ వర్డ్స్ షేర్ చేసుకున్నారు. `ప్రాజెక్ట్ కేలో లెజెండరీ కమల్ హాసన్ సర్‌తో కలిసి పనిచేసేందుకు మాటల్లో చెప్పలేనంత గౌరవంగా ఉంది. అలాంటి సినిమా టైటాన్ లాంటి వ్యక్తితో కలిసి నేర్చుకునే, ఎదిగే అవకాశం వచ్చింది. నా కల నిజమైంది` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు ప్రభాస్. ఇది వైరల్ అవుతుంది.
