నటుడికి నిర్వచనం కమల్ హాసన్. సినిమా అనేది ఓ కళగా భావించి ఆయన వెండితెరపై అధ్బుతాలు చేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమపై కమల్ హాసన్ చరిత్ర చెరపలేని సంతకం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా కళామ తల్లికి సేవ చేస్తున్న ముద్దుబిడ్డ కమల్ హాసన్. కమల్ నటుడిగా వెండితెరకు పరిచయమై సరిగ్గా 61ఏళ్ళు అవుతుంది. ఆరేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా కమల్ హాసన్ చిత్ర సీమలో అడుగుపెట్టారు. బాలనటుడిగా ఆయన మొదటి చిత్రం కాలాతూర్ కన్నమ్మ ఆగస్టు 12, 1960లో విడుదల కావడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు కమల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సాటిలేని నటనతో ప్రెసిడెంట్స్ మెడల్ గెలుచుకున్నారు. కమల్ సినిమా కెరీర్ లో అదొక అరుదైన రికార్డు. 

కమల్ కి గాడ్ ఫాదర్స్ లేకపోయినా లెజెండరీ దర్శకుడు కె బాలచందర్, నటుడిగా ఎదగడంలో ఎంతో తోడ్పాటు ఇచ్చారు. కమల్ హాసన్ లో ఉన్న గొప్పనటుడిని గుర్తించిన బాలచందర్, తన అద్భుత కథలకు హీరోగా కమల్ ని ఎంచుకున్నారు. వీరి కాంబినేషన్ లోవచ్చిన అపూర్వ రాగంగళ్ కమల్ కి హీరోగా  బ్రేక్ ఇచ్చిన చిత్రం. వీరి కాంబినేషన్ అనేక అధ్బు త చిత్రాలు తెరకెక్కాయి. అంతులేని కథ, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, ఇది కథ కాదు  అనే చిత్రాలు కొన్ని మచ్చుక మాత్రమే. 


ప్రయోగాలు చేయడంలో దేశంలో ఏ నటుడైన కమల్ హాసన్ తరువాతే. పాత్ర కోసం శరీర ఆకృతి కూడా మార్చుకొనేవాడు. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావుతో కలిసి ఆయన పుష్పక విమానం, అపూర్వ సహోదరులు వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఒక్క డైలాగ్ లేకుండా అర్ధవంతంగా పుష్పక విమానం సినిమా ముగించిన ఘనుడిగా కమల్ నిలిచిపోయారు. భారత సినిమా చరిత్రలో పుష్పకవిమానం అనేది ఓ అద్భుతం. కమల్ తన హావభావాలతో ఎమోషన్స్, కామెడీ, లవ్ అండ్ రొమాన్స్ పండించారు. అపూర్వ సహోదరులు సినిమాలో ఆయన మరుగుజ్జుగా నటించి మెప్పించారు. 


ఇక కళాతపస్వి దర్శకుడు కె విశ్వనాథ్ గారితో కమల్ చేసిన కళాఖండాల గురించి ఏ పదాలతో వర్ణించగలం అని చెప్పండి. వీరిద్దరూ ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. భారీ తనంతో కాదు, భావపూరితమైన సినిమాలకు ప్రపంచం దాసోహం అవుతుందని నిరూపించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన స్వాతి ముత్యం, సాగరసంగమం ప్రేక్షకులకు సినిమాపై గౌరవాన్ని పెంచాయి. 


కమల్ సకల కళావల్లభుడు అని చెప్పాలి. సినిమా అనేది జీవితం, అది వ్యాపారం కాదని నమ్మే కమల్, సినిమాకు కావలసిన అన్ని ప్రధాన క్రాఫ్ట్స్ నేర్చుకున్నారు. కమల్ ఒక డాన్సర్, దర్శకుడు, సింగర్, రచయిత మరియు నిర్మాత. సినిమాకే జీవితం అంకితం చేసిన కమల్ గురించి రాస్తూ పోతే పదాలు ఆగిపోవాల్సిందే కానీ, ఆయన కీర్తిని పూర్తిగా వివరించలేం. 61 ఏళ్లుగా నిర్విరామంగా సినిమా అనే కళ ద్వారా ప్రేక్షకులకు ఆనందం పంచుతున్న కమల్ ముందు, పద్మశ్రీ, పద్మభూషణ్ లు కూడా దిగదుడుపే.ఇలాగే అనేక సంవత్సరాలు కమల్ సినిమాలు తీయాలి, మనం ఆస్వాదించాలని కోరుకుందాం.