మరోవైపు మణిరత్నంతో ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించారు. ఆ సినిమా చేయడానికి కొంత టైమ్‌ పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశారు కమల్‌. 

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ గతేడాది `విక్రమ్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత కమల్‌కి సరైన బ్లాక్‌ బస్టర్‌ పడింది. దీంతో ఆయన పూర్వ వైభవాన్ని పొందారు. ఆ ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్నారు కమల్‌ హాసన్‌. ఆయన ప్రస్తుతం ఆగిపోయిన `ఇండియన్‌ 2`ని తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతికి ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగులో ప్రభాస్‌ `ప్రాజెక్ట్‌ కే`లో నటిస్తున్నారు. ఇందులో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇది ఇండియాలోనే అతిపెద్ద మూవీ కాబోతుంది. 

మరోవైపు మణిరత్నంతో ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించారు. ఆ సినిమా చేయడానికి కొంత టైమ్‌ పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశారు కమల్‌. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. `కేహెచ్‌233`గా ఈ సినిమా రూపొందబోతుంది. `రైజ్‌ టూ రూల్‌` అనే ట్యాగ్‌ లైన్‌తో వస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో(మోషన్ పోస్టర్‌)లో కమల్‌ జెండా పట్టుకుని ఓ నాయకుడిగా పోరాడుతున్నట్టు, ఫైట్‌ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతున్నట్టుగా ఈ మోషన్‌ పోస్టర్‌ ఉంది.

అయితే దీన్ని పొలిటికల్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కించబోతున్నారట. చాలా కాలంగా దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇది ఫైనల్‌ అయ్యిందని తెలుస్తుంది. దీంతో తాజాగా ప్రకటించారు. రైతుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమల్‌ తన గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా రైతు చట్టాలపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన వ్యతిరేకించారు. రైతులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో వినోద్‌తో చేయబోతున్న సినిమా అదే అంశంతో ఉంటుందని, పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండబోతుందని సమాచారం.

 ఇక ఈ సినిమాని రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్ పతాకంపై కమల్‌ హాసన్‌, మహేంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారట. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని టాక్. మరోవైపు కమెడియన్‌ యోగిబాబు కూడా నటిస్తున్నట్టు సమాచారం. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దర్శకుడు వినోద్‌.. కార్తీతో `ఖాకి`తోపాటు అజిత్‌తో `నేర్కొండ పార్వై`, `వలిమై`, `తునివు` చిత్రాలను రూపొందించారు. 

ప్రస్తుతం కమల్‌ నటిస్తున్న `ఇండియన్‌ 2`కి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన సంచలన చిత్రం `ఇండియన్‌`కిది సీక్వెల్‌. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఓ సామాజిక అంశంతో ఈ సినిమా రూపొందుతుందని, ప్రస్తుతం జనాలు ఫేస్‌ చేసే సమస్యలను ఇందులో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది.