మ్యాచో స్టార్‌ గోపీచంద్‌కి హిట్‌ లేక నాలుగేళ్లు అవుతుంది. `జిల్‌` తర్వాత ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. వరుస పరాజయాలతో ఉన్న ఈ యాక్షన్‌ హీరో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. తనకు `గౌతమ్‌ నందా` వంటి పరాజయాన్ని అందించిన సంపత్‌నంది దర్శకత్వంలో ప్రస్తుతం ఆయన `సీటీమార్‌` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. 

దీంతోపాటు తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు గోపీచంద్‌. తనని `జయం`, `నిజం` చిత్రాల్లో విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో ఇప్పుడు హీరోగా నటిస్తుండటం విశేషం. ఓ విభిన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ ప్లాన్‌ చేశారు. దీనికి `అలివేలు వెంకటరమణ` అనే టైటిల్‌ని ప్రకటించారు. 

తాజాగా ఇందులో గోపీచంద్‌ సరసన నటించే హీరోయిన్‌ కోసం అన్వేషణ చేస్తున్నారు దర్శకుడు తేజ. ఇందులో ముందుగా కాజల్‌ని సంప్రదించారట. ఆమె నో చెప్పడంతో ఇటీవల కీర్తిసురేష్‌ని ఫైనల్‌ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా మరో హీరోయిన్‌ పేరు వినిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తనయ కళ్యాణి ప్రియదర్శన్‌ ని ఎంపిక చేసినట్టు టాక్‌. అయితే ఆమె మెయిన్‌ హీరోయినా? లేక కీర్తితోపాటు సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనుందా? అన్నది సస్పెన్స్ నెలకొంది. 

కళ్యాణి `హలో` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె నటించిన `చిత్రలహరి` ఫర్వాలేదనిపించుకుంది. శర్వానంద్‌ సరసన రొమాన్స్ చేసిన `రణరంగం` పరాజయం చెందింది. ఈ ఫెయిల్యూర్స్ తో టాలీవుడ్‌ ఆమెకి కలిసి రాలేదనే టాక్‌ వినిపించింది. దీంతో మలయాళం, తమిళ చిత్రాలపై ఫోకస్‌ చేసింది. ప్రస్తుతం అక్కడ నాలుగు సినిమాలతో బిజీగా ఉంది.