దర్శకుడు క్రిష్.. దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యపాత్రలు పోషించిన ప్రతి ఒక్కరినీ పాత్రల రూపంలో వెండితెరపై చూపించనున్నారు. ఇప్పటికే రానా, విద్యాబాలన్, సుమంత్, రకుల్ లాంటి నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి కళ్యాణ్ రామ్ పై ఇప్పటికే ఓసారి టెస్ట్ మేకప్ కూడా చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ ఏకంగా 26 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మరణానంతరం ఆయన పాత్రను తెరపై మరింత ఎక్కువసేపు చూపించాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు.

దానికి తగ్గట్లుగా కథలో కొంత భాగాన్ని జోడిస్తున్నారు. కుటుంబపరమైన సన్నివేశాలతో పాటు, చైతన్యరథం సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. డ్రైవింగ్ కి సంబంధించిన సీన్లను తెలంగాణాలో కొన్ని పల్లె ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. తండ్రిని కోల్పోయిన తరువాత 26 రోజుల పాటు తండ్రి పాత్రలో నటించే అవకాశం రావడం కళ్యాణ్ రామ్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమనే చెప్పాలి.