నందమూరి హీరోలకు రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది. దివంగత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి నందమూరి హీరోలు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నటులుగా సినిమాలు చేస్తున్నా.. ఎప్పటికైనా నందమూరి ఫ్యామిలీ హీరోలు రాజకీయాల్లోకి వస్తారని జనాల అభిప్రాయం. అయితే అప్పుడప్పుడు పార్టీ తరఫున ప్రచారకార్యక్రమాల్లో పాల్గొంటుంటారు నందమూరి హీరోలు.

గతంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు. నారా రోహిత్, తారక రత్న ఇలా చాలా మంది ప్రచారాల్లో పాల్గొన్నప్పటికీ కళ్యాణ్ రామ్ మాత్రం ఎప్పుడూ ఆ పని చేయలేదు. బాలకృష్ణకి హరికృష్ణ ఫ్యామిలీకి ఉన్న విబేధాలు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అయితే హరికృష్ణ మరణం తరువాత బాబాయ్ కి బాగా దగ్గరయ్యాడు కళ్యాణ్ రామ్. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాబాయ్ తో కలిసి నటించాడు కూడా.. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశాడు.

తనకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ, రాజకీయాలపై అంతగా అవగాహన లేదని చెప్పారు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం కష్టం కాబట్టి తాను ప్రస్తుతానికి రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదని వెల్లడించాడు. రేపు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన '118' సినిమా ప్రేక్షకుల  ముందుకు రానుంది.