కళ్యాణ్ రామ్ నటించిన `అమిగోస్` మూవీ రేపు విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఆ లెక్కలు ఓ సారి చూస్తే.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన `అమిగోస్` రేపు శుక్రవారం(ఫిబ్రవరి 10)న విడుదల కానుంది. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. ఫ్యాన్స్ కి ఇది ఎగ్జైటింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమా రిలీజ్‌కి టైమ్ లేదు, కానీ దీనిపై ఇండస్ట్రీలో, బయట పెద్దగా చర్చలేకపోవడం గమనార్హం. కళ్యాణ్ రామ్ చివరి చిత్రం `బింబిసార` పెద్ద హిట్ అయ్యింది. ఆయన కెరీర్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. `పటాస్` తర్వాత ఆ స్థాయి హిట్ పడింది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
సహజంగా హిట్ వచ్చిన హీరో నుంచి వచ్చే తదుపరి సినిమాకి మంచి బజ్ ఏర్పడుతుంది. ఆ హిట్ ఎఫెక్ట్ తదుపరి మూవీపై ఉంటుంది. మార్కెట్ పరంగా, బిజినెస్ పరంగా బాగుంటుంది. కానీ కళ్యాణ్ రామ్ విషయంలో ఇప్పుడెందుకో అలా జరగడం లేదు. ఆయన నటించిన `అమిగోస్` చిత్రంపై ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కావడం లేదు. ఎందుకనే కారణాలు చూస్తే, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే అంటున్నారు.
సినిమా నుంచి రెండు మూడు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. `ఎన్నో రాత్రులు వచ్చాయి కానీ` అనే రీమిక్స్ పాట తప్ప ఏదీ ఆడియెన్స్ కి చేరలేదు. ట్రైలర్‌తో బజ్ క్రియేట్ అవుతుందని భావించారు. కానీ ట్రైలర్ లో విషయం లేదని తేలిపోయింది. అసలు ఏం చెప్పదలుచుకున్నారో దర్శకుడికే క్లారిటీ లేదన్నట్టుగా ఉంది. దీనికితోడు వీక్ ప్రమోషన్స్. సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వీక్‌గా ఉన్నాయి. గ్రూప్ ఇంటర్వ్యూ, కళ్యాణ్ రామ్, హీరోయిన్ ఇంటర్వ్యూ తప్ప మిగిలిన మీడియా మాధ్యమాలకు ఇంటర్వ్యూలుగానీ, ప్రమోషన్స్ టూర్స్ గానీ చేసింది లేదు.
ఆ ఎఫెక్ట్ సినిమాపై చాలా పడిందని తెలుస్తుంది. అయితే సినిమా రిజల్ట్ ని ముందే ఊహించి ప్రమోషన్స్ కూడా వేస్ట్ అనుకున్నారో ఏమో టీమే స్థబ్దుగా వ్యవహరిస్తున్నట్టు ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చిన ఆ ఊపు తీసుకురాలేకపోయారు. పైగా తారక్ కూడా గొప్పగా మాట్లాడలేకపోయారు. ఆయన ఇంకా సినిమా చూడలేకపోవడంతో పెద్దగా మాట్లాడలేకపోయినట్టు తెలుస్తుంది. బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆడియెన్స్ లో చర్చ లేకపోవడంతో ఆ ప్రభావాన్ని గమనించిన యూనిట్ ఇప్పుడు హుటాహుటిన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. నష్టనివారణ చర్యలు చేపట్టారు. మరి ఇది సినిమాకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి.
అయితే సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా తక్కువగానే జరిగిందని ట్రేడ్ వర్గాల టాక్. కళ్యాణ్ రామ్ `బింబిసార` సుమారు రూ.యాభై కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసిందన్నారు. ఆ లెక్కన `అమిగోస్` భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగాలి. కానీ అలా జరగలేదట. సోషల్ మీడియా, ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమా 12కోట్ల లోపే(11.30కోట్లు) థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయట. ఈ మొత్తాన్ని అయినా రికవరీ చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్న బయ్యర్లు సేఫ్‌లో ఉండాలంటే సినిమా 12కోట్ల షేర్ వసూలు చేయాలి. రిలీజ్ అయ్యాక రిజల్ట్ బాగుంటే అది పెద్ద సమస్య కాదు, కానీ తేడా కొడితే మాత్రం కష్టమనే టాక్ వినిపిస్తుంది.
రిలీజ్ పరంగా సినిమాకి భారీగానే థియేటర్లు దొరికాయట. రెండు రాష్ట్రాల్లో సుమారు 740కిపైగా థియేటర్లలో రిలీజ్ కాబోతుందని టాక్. పైగా సింగిల్ రిలీజ్ కావడం విశేషం. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేకపోవడం కలిసొచ్చే అంశం. ఇది `అమిగోస్` సినిమాకి ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి.
