టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు పాజిటివ్ క్యారెక్టర్లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు నెగెటివ్ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు తేజ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. సినిమాలో కాజల్ టైటిల్ పాత్ర పోషిస్తోంది. ఈ పాత్ర కోసం అమ్మడు చాలా కష్టపడుతోందట.

డబ్బు, దురాశ, అహంకారం ఇలా అన్నీ కలగలిపిన క్యారెక్టర్ లో కాజల్ కనిపించబోతోందని తెలుస్తోంది. కాజల్ ని నెగెటివ్ రోల్ లో చూపించడం ద్వారా కథకి ఫ్రెష్ నెస్ వస్తుందని భావిస్తున్నాడు దర్శకుడు తేజ. ఆ కారణంగానే స్టార్ హీరోయిన్ ని నెగెటివ్ రోల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటివరకు కాజల్ నటించిన సన్నివేశాలను చూసిన దర్శకనిర్మాతలు సంతృప్తిగా ఫీల్ అయ్యారట. సినిమా ఔట్ పుట్ కూడా బాగా వస్తుందని నమ్ముతున్నారు. కాజల్ నెగెటివ్ రోల్ లో నటించడం ఇదే తొలిసారి. మరి తన పెర్ఫార్మన్స్ తో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్రస్తుతం కాజల్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ క్వీన్ కి రీమేక్ గా రూపొందుతోన్న 'పారిస్ పారిస్' సినిమాలో నటిస్తోంది. అలానే కమల్ హాసన్ సరసన 'భారతీయుడు 2'లో కనిపించడానికి సిద్ధమవుతోంది.